సమర్థ నాయకత్వంతోనే పెట్టుబడులు

ప్రధానాంశాలు

సమర్థ నాయకత్వంతోనే పెట్టుబడులు

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌

నందిగామ న్యూస్‌టుడే: సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉన్నందు వల్లే తెలంగాణలో పారిశ్రామికవేత్తలు విరివిగా పెట్టుబడులు పెడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడ శివారులో నూతనంగా నిర్మించిన పొకర్ణ ఇంజినీర్డ్‌ స్టోన్‌ పరిశ్రమను శనివారం కేటీఆర్‌.. మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా టీఎస్‌ ఐపాస్‌ ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని, దీనిద్వారా ఇప్పటివరకు 15 వేల యూనిట్లకు అనుమతులు మంజూరు చేసినట్లు వివరించారు. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, కులవృత్తులను ప్రోత్సహిస్తూనే మరోవైపు యువతకు ఐటీ, పరిశ్రమ రంగాల్లో ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. పొకర్ణ గ్రూప్‌ టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఛైర్మన్‌ గౌతమ్‌చంద్‌ జైన్‌కు మంత్రి కేటీఆర్‌ సూచించారు. రూ.500 కోట్లతో స్థాపించిన ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్తూరు మండలం సిద్దాపూరు గ్రామంలో 200 వందల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉందని, ఇక్కడ కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌.. కేటీఆర్‌ను కోరారు. అంతకుముందు పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, కాలె యాదయ్య, దానం నాగేందర్‌, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ ఈట గణేష్‌, స్థానిక సర్పంచి పాండురంగారెడ్డి పాల్గొన్నారు.

కేటీఆర్‌ కాన్వాయ్‌ అడ్డగింతకు కాంగ్రెస్‌ యత్నం

పరిశ్రమ ప్రారంభానికి వస్తున్న మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు. నందిగామ బైపాస్‌ రోడ్డు నుంచి మేకగూడ వరకు మూడు చోట్ల కాంగ్రెస్‌ నేతలు చెట్ల పొదల్లోంచి కాన్వాయ్‌ వైపు దూసుకొచ్చారు. ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 33 మందిపై కేసులు నమోదు చేశారు. అంతకుముందు 14 మంది భాజపా నేతలను ముందస్తు అరెస్టు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని