యువత నైపుణ్య రంగాలపై దృష్టి సారించాలి

ప్రధానాంశాలు

యువత నైపుణ్య రంగాలపై దృష్టి సారించాలి

దేశాభివృద్ధిలో భాగస్వాములవ్వాలి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధ

శంషాబాద్‌, న్యూస్‌టుడే: భారతీయ యువతలో అపారమైన ప్రతిభాపాటవాలు ఉన్నాయని, నైపుణ్య రంగాలపై దృష్టి సారించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ కష్టపడేతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో జీఎమ్మార్‌ వరలక్ష్మీ ఫౌండేషన్‌ (జీఎమ్మార్‌వీఎఫ్‌) ఆధ్వర్యంలో యువతకు ఉచితంగా అందిస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాలు, విద్యా సంస్థలను జీఎమ్మార్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గ్రంధి మల్లికార్జునరావుతో కలిసి ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. తమ శక్తి సామర్థ్యాలకు యువత నిరంతరం పదును పెట్టుకోవడం ద్వారా సమాజంలో రాణించవచ్చన్నారు. నిరుద్యోగ యువతకు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని శిక్షణ అందిస్తేనే నైపుణ్య భారత్‌గా ఆవిర్భవిస్తుందన్నారు. ఉదారవాదంతో సామాజిక సేవలు, యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను జీఎమ్మార్‌వీఎఫ్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇక్కడ శిక్షణ ఇస్తున్న ఎలక్ట్రీషియన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, టూ వీలర్‌ టెక్నీషియన్‌, వెల్డింగ్‌, టైలరింగ్‌ విభాగాలను పరిశీలించారు. శిక్షణ తీసుకుంటున్న యువతతో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. ఎలక్ట్రీషియన్‌ కోర్సులో శిక్షణ పొందుతున్న యువకులకు సామగ్రి కిట్లను అందజేశారు. జీఎమ్మార్‌ చిన్మయ విద్యాలయంలో మొక్కలను నాటారు. గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. చిన్మయ విద్యాలయంలో పేద విద్యార్థులకు గిఫ్టెడ్‌ చిల్డ్రన్‌ స్కీం వరంగా మారిందని వివరించారు. శివారు గ్రామాలకు చెందిన వంద మంది విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును జీఎమ్మార్‌వీఎఫ్‌ భరిస్తోందన్నారు. పదిహేనేళ్లుగా దేశ వ్యాప్తంగా 20 కేంద్రాల్లో స్థానిక యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని