హుజూరాబాద్‌ తర్వాత రాష్ట్రమంతా

ప్రధానాంశాలు

హుజూరాబాద్‌ తర్వాత రాష్ట్రమంతా

పకడ్బందీగా దళితబంధు కార్యాచరణ

ఇదేదో డబ్బుల పంపిణీ వ్యవహారం కాదు

మంత్రిమండలిలో సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో ‘దళితబంధు’ ప్రారంభమై.. లబ్ధిదారుల ఎంపిక ముగిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా దానిని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. దళితులను పేదరికం నుంచి శాశ్వతంగా దూరం చేయాలనే బృహత్తర లక్ష్యంతో చేపట్టిన ఈ పథకంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టీ కేంద్రీకృతమైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా సహా విపత్తులను, సవాళ్లను ఎదుర్కొనడంలో, పథకాల విజయవంతంలో ముఖ్యపాత్ర పోషించిన మంత్రులు, ప్రజాప్రతినిధులంతా ఈ పథకం అమలులో కీలక భాగస్వాములుగా ఉండాలన్నారు. దాదాపు అరున్నర గంటల పాటు మంత్రిమండలి సమావేశం జరిగింది. అధికారిక ఎజెండా ముగిసిన అనంతరం ఆయన మంత్రులతో విడిగా చర్చించారు. ‘‘దళితబంధు పథకం అమలులో అధికార యంత్రాంగం కీలకమైనా.. పర్యవేక్షణ బాధ్యతలను ప్రజాప్రతినిధులే చేపట్టాలి.. ఈ పథకం కేవలం డబ్బుల పంపిణీగా ఉండబోదు. యూనిట్ల ఏర్పాటుకు తప్ప వారికి వేరేవిధంగా ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. దళితులకు నూతన దశను, దిశను నిర్దేశిస్తుంది. ఈ పథకం ప్రారంభానికి ముందే పూర్తి నిధులను కేటాయిస్తాం.

విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి

దళితబంధుతో విపక్షాల గుండెల్లో దడ మొదలైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విమర్శలు చేస్తున్నాయి. ఇతర పార్టీలు కొత్త దుకాణాలు పెడుతున్నాయి. దళితులు బాగుపడుతుంటే ప్రోత్సహించాల్సింది పోయి నానా రకాలుగా మాట్లాడుతున్నారు. వారి విమర్శలను తిప్పికొట్టాలి.

వచ్చే రెండేళ్లలో లక్ష రుణమాఫీ

అన్నదాతకు ఏ లోటు రాకుండా చూడడం వల్లనే వారు బాగున్నారు. రైతుబంధు, బీమాలతో పాటు అన్నిరకాలుగా అండగా ఉన్నాం. రుణమాఫీ వీటికి అదనం. వచ్చే రెండేళ్లలో రూ. లక్ష వరకు రుణ మాఫీ చేస్తాం. కరోనా ముప్పు తొలగలేదు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండేలా చూడాలి.

ఆలోచించే కౌశిక్‌ ఎంపిక

ఎమ్మెల్సీ పదవికి అన్ని కోణాల్లో ఆలోచించే కౌశిక్‌రెడ్డిని ఎంపిక చేశాం. పోటీ చేసిన తొలిసారే 34.60 శాతం ఓట్లు పొందడం అంటే మాటలు కాదు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. హుజూరాబాద్‌లో పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషిస్తారు’’ అని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని