భేటీ ప్రశ్నార్థకం

ప్రధానాంశాలు

భేటీ ప్రశ్నార్థకం

నేటి కృష్ణా, గోదావరి సమన్వయ కమిటీ సమావేశాలకు తెలంగాణ హాజరు అనుమానమే

ఈనాడు హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ నేపథ్యంలో ఇందులోని అంశాలను ముందుకు తీసుకెళ్లేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశాలు జరగడం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రాలపై ఈ నోటిఫికేషన్‌ తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందుగా పూర్తి స్థాయి బోర్డు సమావేశంలో సమగ్రంగా చర్చించి తర్వాత సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది.  మొదట సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి, తర్వాత వెంటనే బోర్డు సమావేశం ఏర్పాటు చేద్దామని.. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి రావాలంటూ గోదావరి నదీ యాజమాన్య బోర్డు తిరిగి సమాధానమిచ్చింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ తర్వాత తదుపరి కార్యాచరణ గురించి నివేదించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కోరిందంటూ లేఖనూ జత చేసింది. అయితే పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని మొదట నిర్వహించాలన్న తెలంగాణ మంగళవారంనాటి సమావేశానికి హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది.

కృష్ణా బోర్డు సైతం..

కృష్ణా బోర్డు కూడా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి మంగళవారం సమావేశం ఏర్పాటు చేసినట్లు సోమవారం రెండు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. గోదావరి బోర్డు సమావేశం జరగకపోతే ఇది కూడా జరిగే అవకాశం లేదు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించిన కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ, జులై 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ స్వాగతించగా, తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గత నెల 28న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి రెండు బోర్డుల ఛైర్మన్లకు లేఖ రాశారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలు నిర్ణయించిన గడువులోగా అమలయ్యేలా తేదీల వారీగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి పంపాలని సూచించారు. దీని ఆధారంగా బోర్డుతో సంబంధం లేకుండా 11 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన గోదావరి నదీ యాజమాన్యబోర్డు, ఈ కమిటీతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసింది. కమిటీలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, పరిపాలనా విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం, గోదావరి బోర్డు అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్న దశలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 12 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకోవడంతో పాటు మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. మొదట పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని తెలంగాణ కోరినందున, సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని