రోజుకు 28 టీఎంసీలు దిగువకు

ప్రధానాంశాలు

రోజుకు 28 టీఎంసీలు దిగువకు

సాగర్‌ నుంచి 22 గేట్ల ద్వారా సముద్రానికి వెళ్తున్న వరద
ఎగువన తగ్గుతున్న ప్రవాహాలు

ఈనాడు, హైదరాబాద్‌, నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ నిండటంతో  వచ్చిన వరదను వచ్చినట్లే దాదాపుగా దిగువకు వదులుతున్నారు. రోజుకు 28 టీఎంసీలు సముద్రంవైపునకు వెళ్తున్నాయి. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం ఉద్ధృతి దృష్ట్యా ఆదివారం సాయంత్రం 14 గేట్ల ద్వారా 1,06,462 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేసిన అధికారులు.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో 22 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సాగర్‌కు 3,72,737 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. గేట్ల ద్వారా 3,18,934 క్యూసెక్కులు, ఎడమకాల్వ, ప్రధాన విద్యుత్కేంద్రం, ఎస్‌ఎల్బీసీ, వరద కాల్వ ఇతరత్రా కలుపుకొని మొత్తం 3,55,349 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలాశయ నీటిమట్టం 587.30 (గరిష్ఠం 590) అడుగుల వద్ద ఉంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి గేట్లు, విద్యుదుత్పత్తి కలుపుకొని ప్రకాశం బ్యారేజీకి 3.54 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సుంకేశుల నుంచి 36,576 క్యూసెక్కులు, జూరాల నుంచి 2,44,375 క్యూసెక్కులు శ్రీశైలం వైపునకు వస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ జల విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం 29,893 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్‌ ఉత్పత్తితో 33,549 క్యూసెక్కులు, గేట్లు ఇతరత్రా కలిపి 4,36,170 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

పశ్చిమగాలులతో పొడి వాతావరణం

పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉండటంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. వర్షాలు తగ్గిపోయాయి. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న చెప్పారు. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 36 ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా ధరూర్‌(వికారాబాద్‌ జిల్లా)లో 1.9, తలమడుగు(ఆదిలాబాద్‌)లో 1.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని