రైతుబంధు మొదలైన చోటే దళితబంధుకు శ్రీకారం

ప్రధానాంశాలు

రైతుబంధు మొదలైన చోటే దళితబంధుకు శ్రీకారం

శాలపల్లి-ఇందిరానగర్‌లో ప్రారంభోత్సవ సభ  
సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయ నిర్ణయం  

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 2018 మే పదో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధును ప్రారంభించిన చోటనే తెలంగాణ దళితబంధుకు శ్రీకారం చుట్టనున్నారు. హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్‌లో ఈ నెల 16న దళితబంధును ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. అనేక పథకాల ప్రారంభానికి కరీంనగర్‌ జిల్లాను సీఎం ఎంచుకోగా... రైతుబంధుకు సైతం అదే జిల్లాలోని హుజూరాబాద్‌ను ఎంపిక చేశారు. జమ్మికుంటకు వెళ్లే మార్గంలో హుజూరాబాద్‌కు 12 కిలోమీటర్ల దూరంలోని విశాలమైన స్థలం ఉండటంతో అప్పట్లో కెప్టెన్‌ లక్ష్మికాంతరావు సూచన మేరకు శాలపల్లి-ఇందిరాగనర్‌ను ఎంచుకొని భారీ సభను నిర్వహించారు. తాజాగా దళిత సాధికారతలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ. పదేసి లక్షలతో యూనిట్లను స్థాపించి ఉపాధిని కల్పించేందుకు దళితబంధు పథకాన్ని సీఎం చేపట్టారు. ఆగస్టు 16న దానిని హుజూరాబాద్‌లో ప్రారంభించాలని మంత్రిమండలి నిర్ణయించింది.  ప్రారంభోత్సవ సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలతో చర్చించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా శాలపల్లి-ఇందిరానగర్‌ ప్రస్తావనకు వచ్చింది. రైతుబంధుకు ఆ స్థలం అచ్చొచ్చిందని, పథకం పూర్తిగా విజయవంతమైందని, ఎన్నికల్లో విజయానికి సైతం సహకరించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో దళితబంధు ప్రారంభానికీ శాలపల్లి-ఇందిరానగర్‌నే సీఎం ఎంపిక చేశారు.జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌లకు సైతం ముందస్తు సమాచారం అందించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సోమవారం శాలపల్లి-ఇందిరానగర్‌ను సందర్శించారు. మంగళవారం నుంచి నేతలు అక్కడ పర్యటించనున్నారు.

ఉప ఎన్నికల ప్రచారానికి మరో దఫా సీఎం పర్యటన!

దళితబంధు పథకం ప్రారంభోత్సవం అనంతరం సీఎం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మరో దఫా హుజూరాబాద్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  ఉప ఎన్నికల నోటిఫికేషన్‌కు  ఇంకా సమయం ఉన్నందున అది ఖరారయిన తర్వాత సీఎం ఎన్నికల సభను పార్టీ నిర్వహించనుంది.

నోటిఫికేషన్‌ తర్వాతే అభ్యర్థి ఎంపిక

కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాతే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలకు అభ్యర్థిని ఖరారు చేయాలని తెరాస అధిష్ఠానం భావిస్తోంది. అప్పటి వరకు వివిధ సర్వేలు, అభిప్రాయ సేకరణలు జరపాలని నిర్ణయించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని