రూ.806 కోట్లతో ఎత్తిపోతలు

ప్రధానాంశాలు

రూ.806 కోట్లతో ఎత్తిపోతలు

నీటిపారుదల శాఖ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌ : నెల్లికల్‌ ఎత్తిపోతలు సహా నాలుగింటిని రూ.806 కోట్లతో చేపట్టేందుకు నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నెల్లికల్‌ గ్రామం వద్ద నాగార్జునసాగర్‌ వెనుక నుంచి నీటిని ఎత్తిపోసేందుకు గతంలో రూ.72.16 కోట్లతో ఇచ్చిన అనుమతిని రద్దు చేసి, కొన్ని మార్పులతో ఈ పనిని రూ.664.80 కోట్లతో చేపట్టేందుకు అంగీకరించింది. దీంతోపాటు మరో మూడు ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఈ పథకాలున్నాయి. ఈ పథకాలన్నింటికీ సాంకేతిక అనుమతి ఇచ్చే ముందే సంబంధిత అథారిటీ నుంచి నీటి లభ్యత అనుమతి పొందాలని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌కు సూచించారు. నెల్లికల్‌ ఎత్తిపోతల పథకానికి గత ఏడాది డిసెంబరు5న రూ.72.16 కోట్లతో 4,175 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఐడీసీ) ద్వారా ఈ పనిని చేపట్టారు. అయితే ఈ పని తీసుకొన్న గుత్తేదారుతో ఒప్పందం రద్దు చేసుకొని డిపాజిట్‌ను వెనక్కు ఇచ్చి తాజాగా మళ్లీ చేపట్టాలని సోమవారం జారీ చేసిన ఆదేశంలో పేర్కొన్నారు. వర్టికల్‌ టర్బైన్‌ పంపులను వినియోగించి పంపుహౌస్‌ నిర్మించడంతోపాటు కాలువల నిర్మాణం, నిర్వహణ ఇలా అన్నీ కలిపి చేపట్టేందుకు పాత పనిని రద్దు చేసి కొత్తగా టెండర్‌ పిలిచేందుకు రూ.692.40 కోట్లకు సంబంధిత ఇంజినీర్లు ప్రతిపాదన పంపారు. దీనిని ప్రభుత్వం పరిశీలించి రూ.664.80 కోట్లకు అనుమతి ఇచ్చింది. దీంతోపాటు అయిటిపాముల ఎత్తిపోతలను రూ.101.62 కోట్లు, దామరచర్ల మండలంలోని తుంగపాడువాగుపై వీర్లపాలెం-2 పథకానికి రూ.32.22 కోట్లు, తోపుచర్లలో రూ.9.30 కోట్లతో చేపట్టేందుకు పరిపాలనా అనుమతి ఇస్తూ ఆదేశాలిచ్చింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని