రూ.3,600 కోట్లతో గోదాములు!

ప్రధానాంశాలు

రూ.3,600 కోట్లతో గోదాములు!

40 లక్షల టన్నుల సామర్థ్యంతో నిర్మాణానికి మార్కెటింగ్‌ శాఖ ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గోదాముల కొరత సమస్యను నివారించేందుకు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ తాజాగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నూతనంగా 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములను నిర్మించాలని భావిస్తోంది. ఇందుకు రూ.3,600 కోట్లు అవసరమని లెక్కగట్టింది. ఈ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందడంగానీ లేదా అప్పుగా నాబార్డు నుంచి తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. 

ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్లలో 24 లక్షల టన్నులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (ఎస్‌డబ్ల్యూసీ)కు 2.90 లక్షల టన్నులు, పౌరసరఫరాలశాఖకు, మార్క్‌ఫెడ్‌కు 33 లక్షల టన్నులు, ప్రైవేటు యాజమాన్యాల చేతిలో మరో 30 లక్షల టన్నులు సామర్థ్యం గల గోదాములున్నాయి. మార్చికి సిద్ధమయ్యేలా 3.15 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములను ఎస్‌డబ్ల్యూసీ నిర్మిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మొత్తం గోదాముల నిల్వ సామర్థ్యం 93 లక్షల టన్నులుగా ఉంది. రాష్ట్రంలో పంట దిగుబడులు 2.50 కోట్ల టన్నులకు పైగా వస్తున్నాయి. పైగా పంటలకు అవసరమైన ఎరువులు 10 లక్షల టన్నులకు పైగా ఎప్పుడూ నిల్వలుంటాయి. వీటన్నింటి నిల్వకు సరిపడా గోదాములు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటి నివారణకే ప్రభుత్వం కొత్త గోదాముల నిర్మాణం చేపడుతోందని ఎస్‌డబ్ల్యూసీ ఎండీ జితేందర్‌ ‘ఈనాడు’కు చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని