ప్రభుత్వం, డిస్కంల మధ్య విభజన అవసరం

ప్రధానాంశాలు

ప్రభుత్వం, డిస్కంల మధ్య విభజన అవసరం

సంస్కరణలపై నీతి ఆయోగ్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు విజయవంతం కావాలంటే.. ప్రభుత్వానికి, పంపిణీ సంస్థలకు మధ్య స్పష్టమైన విభజన ఉండాలని, అప్పుడే అవి నిర్వహణ, ఆర్థికపరమైన స్వయం ప్రతిపత్తి చూపగలుగుతాయని నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది. మంచి పాలనా విధానాలు, సమర్థమైన డైరెక్టర్లతో పాటు, టారిఫ్‌లను అవసరమైనప్పుడు సవరించగల విద్యుత్‌ నియంత్రణ మండళ్లు (ఈఆర్‌సీ) ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. మంగళవారం ‘విద్యుత్‌ పంపిణీ రంగం- సంస్కరణల్లో ఉత్తమ విధానాలు’ పేరుతో నీతి ఆయోగ్‌ నివేదిక విడుదల చేసింది. 

నివేదికలోని ముఖ్యాంశాలు

విద్యుత్‌ పంపిణీలో ఫ్రాంచైజీ విధానం ప్రవేశపెట్టటం వల్ల పోటీ పెరుగుతుంది. కస్టమర్లు తమకు నచ్చిన సంస్థను ఎంచుకోవటం సాధ్యమవుతుంది. ఒడిశా, భివాండీ(మహారాష్ట్ర), దిల్లీలలో ఈ మార్గాన్ని అనుసరించటం వల్ల మీటరింగ్‌, బిల్లింగు, వసూళ్లలో మంచి ఫలితాలు వచ్చాయి. దిల్లీలో 2002లో 55 శాతంగా ఉన్న సాంకేతిక వాణిజ్య నష్టాలు 2019 నాటికి 9 శాతానికి తగ్గాయి. గ్రామాల్లో ఫ్రాంచైజీ విధానం బాగా ఉపయోగపడుతుంది. నష్టాలు అధికంగా ఉన్నచోట పీపీపీ విధానాన్ని అనుసరించవచ్చు.

* డిస్కంలు ఏటా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో అవి రూ. 90వేల కోట్లకు చేరాయి. దీనికితోడు  నిర్వహణాలోపాలు, దీర్ఘకాలిక విద్యుత్‌ ఒప్పందాలు పరిస్థితిని దిగజారుస్తున్నాయి. దీంతో అవి సకాలంలో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు చేయలేకపోతున్నాయి. ఈ మొత్తం మార్చి 2021 నాటికి రూ.67,971కోట్లకు చేరాయి. దానితోపాటు నాణ్యమైన విద్యుత్తును అందించటానికి పెట్టుబడులు పెట్టలేకపోతున్నాయి. పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి మెరుగుకు అవసరమైన చర్యలు చేపట్టలేకపోతున్నాయి. సమర్థమైన పంపిణీ వ్యవస్థ వల్ల ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’తో పాటు ‘ఈజ్‌ ఆఫ్‌ లైఫ్‌’ కూడా పెరుగుతుంది.

* చాలా రాష్ట్రాలు రైతులకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నాయి. దీనిలో లీకేజీల వల్ల డిస్కంలకు భారీ ఎత్తున నష్టం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్రలలో వ్యవసాయ అవసరాలకు ఫీడర్లను విడదీయటం వల్ల అక్కడి డిస్కంలు నష్టాలను అధిగమించగలిగాయి.

* సబ్సిడీ విద్యుత్తును అందుకునేవారికి నగదు బదిలీ చేయటం వల్ల చాలా వరకూ లీకేజీలను నివారించవచ్చు. మధ్యప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో అమలు చేశారు.

* వ్యవసాయానికి సౌరపంపులను ప్రోత్సహించటం వల్ల విద్యుత్‌ సేకరణ ధరలను తగ్గించుకోవచ్చు.

* డిస్కంలు దీర్ఘకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలలో చిక్కుకుపోయాయి. మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులో ఉన్నంత వరకూ ఇలా ఎక్కువ కాలంలో ఉండే ఒప్పందాల్లోకి దిగకుండా ఉండటం మంచిది.

* డిమాండ్‌ అధికంగా ఉన్నప్పుడు డిస్కంలు ఎక్కువ ధర వసూలు చేయాలి. గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ను ఎదుర్కోవటానికి స్మార్ట్‌మీటర్లు, స్మార్ట్‌ గ్రిడ్‌లు ఉపయోగపడతాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని