సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల వెల్లడి

ప్రధానాంశాలు

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల వెల్లడి

రికార్డు స్థాయిలో 99.04% ఉత్తీర్ణత
బాలికలదే పైచేయి

దిల్లీ/ఈనాడు, హైదరాబాద్‌: ది సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) మంగళవారం వెల్లడించిన పదో తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయిలో 99.04 శాతం ఉత్తీర్ణత నమోదయింది. 0.35 శాతం స్వల్ప తేడాతో బాలురపై బాలికలు పైచేయి సాధించారు. ఈ వ్యత్యాసం గతేడాది 3.7 శాతం. ఉత్తీర్ణత శాతం కూడా గతేడాది (91.46%) కంటే ఇపుడు ఏడు శాతం మేర పెరిగింది. ఈ ఏడాది బాలికలు 99.24 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 98.89 శాత ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్‌జెండర్‌ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. కొవిడ్‌-19 రెండోదశ ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది సీబీఎస్‌ఈ పది, 12 తరగతుల పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. మొత్తం 21.13 లక్షల రెగ్యులర్‌ విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆయా విద్యార్థులు గత పరీక్షల్లో చూపించిన ప్రతిభ, ప్రత్యామ్నాయ మదింపు విధానాల ఆధారంగా బోర్డు తాజా  ఫలితాలను వెల్లడించింది. ఇంకా 16,639 మంది విద్యార్థుల ఫలితాలు పెండింగులో ఉన్నాయని.. ఈ ఏడాది విద్యార్థులకు మెరిట్‌ జాబితాలు, మెరిట్‌ ధ్రువపత్రాల వంటివి ఏవీ ఉండవని సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ సన్యం భరద్వాజ్‌ తెలిపారు.

* విదేశాల్లోని సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లోనూ 99.92 శాతం మేర పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జవహర్‌ నవోదయ విద్యాలయాలు 99.99% ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలు నమోదు చేశాయి. గతేడాది 1.5 లక్షల విద్యార్థులు కంపార్ట్‌మెంటు కింద నమోదుకాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 17,636కు తగ్గింది. ఆగస్టు 16- సెప్టెంబరు 15 తేదీల మధ్య కంపార్ట్‌మెంటు పరీక్షలు ఉంటాయని, తేదీలను తర్వాత ప్రకటిస్తామని భరద్వాజ్‌ తెలిపారు. చెన్నై రీజియన్‌ పరిధిలోని ఏపీలో 100% విద్యార్థులు (24,012)  ఉత్తీర్ణులు కాగా.. తెలంగాణలో 99.99 శాతం (31,605) పాసయ్యారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని