రాష్ట్రాల రుణ పరిమితికి కొత్త సూత్రాలు

ప్రధానాంశాలు

రాష్ట్రాల రుణ పరిమితికి కొత్త సూత్రాలు

జీఎస్‌డీపీ అంచనాలను పెంచి అధికంగా అప్పులు చేస్తున్నాయి
శోధన నివేదికలో ఎస్‌బీఐ వెల్లడి

ముంబయి: రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) అంచనాలను పెంచి చూపడం ద్వారా అధికంగా అప్పులు చేస్తున్నాయని... వాటి రుణ పరిమితిని నిర్వచించేందుకు కొత్త సూత్రీకరణ అవసరమని ఎస్‌బీఐ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశంలో అతిపెద్ద రుణదాత సంస్థ అయిన ఎస్‌బీఐ... ‘ఎకోరాప్‌’ పేరున రూపొందించిన ఆర్థిక పరిశోధన నివేదికను మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త సౌమ్యా కాంతి ఘోష్‌ మాట్లాడారు. రాష్ట్రాల రుణ పరిమితి వాటి జీఎస్‌డీపీలకు అనుగుణంగా ఉండాలని ఆర్థికసంఘం చెప్పిందన్నారు. దీంతో రుణాలను పెంచుకునేందుకు రాష్ట్రాలు బడ్జెట్‌లో జీఎస్‌డీపీ అంచనాలను పెంచి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. అప్పులు తీసుకున్నాక ఆ అంచనాలు తగ్గిపోతున్నాయన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, యూపీ, తమిళనాడు, రాజస్థాన్‌ రాష్ట్రాలు 2021, అంతకు ముందు ఆర్థిక సంవత్సరాల్లో వాస్తవ జీఎస్‌డీపీ పరిమితి కంటే 3% అధికంగా అప్పులు చేశాయి. ఈ ధోరణి పెరుగుతోంది. జీఎస్‌డీపీతో సంబంధం లేకుండా రాష్ట్రాల రుణపరిమితిని నిర్వచించే కొత్త సూత్రీకరణ అవసరమనుకుంటున్నాం. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి.

* రుణాల విషయంలో సరైన విధానాలు అనుసరించిన రాష్ట్రాలకు తదుపరి ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితులు పెంచవచ్చు.

* పరిమితికి మించి రుణాలు పొందాలనుకునే రాష్ట్రాలకు మరో పథకం కింద అధిక వడ్డీకి వాటిని అందించవచ్చు.

* పన్ను ఆదాయానికి అనుగుణంగా రాష్ట్రాల రుణ పరిమితిని నిర్ణయించవచ్చు.


స్థానిక సంస్థలకు గ్రాంట్లు పెరిగాయి...

రాష్ట్రాల రుణ పరిమితి అంశాన్ని 15వ ఆర్థిక సంఘం పరిశీలించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు తమజీఎస్‌డీపీలో 4% వరకూ రుణాలు తీసుకోవచ్చని, విద్యుత్‌ సంస్కరణలపై ఆధారపడి మరో 0.5% మేర రుణాలు పొందవచ్చని నిర్దేశించింది. 2022లో స్థానిక సంస్థలకు గ్రాంట్లు పెరిగాయి. వాటికి రూ.2.2 లక్షల కోట్లు ఇచ్చేందుకు పరిమితి విధించారు. ఇందులో రూ.1.54 లక్షల కోట్లను బేషరతుగా అందిస్తారు. మరో రూ.67,105 కోట్లను పట్టణ స్థానిక సంస్థల సంస్కరణల ఆధారంగా, కొన్ని షరతులను బట్టి గ్రాంటుగా ఇచ్చేందుకు అనుమతించారు’’ అని నివేదిక పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని