గేట్‌లో పెరుగుతున్న సబ్జెక్టులు

ప్రధానాంశాలు

గేట్‌లో పెరుగుతున్న సబ్జెక్టులు

వచ్చే ఏడాదికి జీఈ, ఎన్‌ఎం అదనం
30 నుంచి దరఖాస్తుల ప్రక్రియ

ఈనాడు, హైదరాబాద్‌: గేట్‌కు ఏటా సబ్జెక్టుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులకు మరింత వెసులుబాటు ఉండనుంది. గేట్‌-2021 వరకు 27 రకాల సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలతోపాటు దేశవ్యాప్తంగా పలు జాతీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఎంటెక్‌ సీట్ల భర్తీకి గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌) చేపడతారు. 2022లో నిర్వహించే పరీక్షకు రెండు సబ్జెక్టులు- జియోమాటిక్స్‌ ఇంజినీరింగ్‌(జీఈ), నావల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌(ఎన్‌ఎం) అదనంగా ఉంటాయి. దీంతో ఈ సంఖ్య 29 కానుంది. 2021లో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌లను చేర్చారు. బీఏ, బీకాం, బీఎస్‌సీ మూడో ఏడాది విద్యార్థులు కూడా పోటీపడే అవకాశం ఇచ్చారు.

వచ్చే ఫిబ్రవరిలో పరీక్షలు
గేట్‌-2022ను ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిర్వహించనుంది. వచ్చే ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. ఈనెల 30వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబరు 24 వరకు ఆలస్య రుసుం ఉండదు. ఆ తర్వాత నుంచి అక్టోబరు 1 వరకు ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 17న ఫలితాలు వెలువరిస్తారు. గేట్‌లో సాధించిన స్కోర్‌ మూడేళ్లపాటు చెల్లుతుంది. అంటే మూడేళ్ల లోపు దేశవ్యాప్తంగా ఎంటెక్‌ తదితర కోర్సుల్లో చేరేందుకు పోటీపడొచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా 1.50 లక్షల మంది రాస్తారు. ఒక అభ్యర్థి గరిష్ఠంగా రెండు సబ్జెక్టుల్లో పరీక్షలు రాయొచ్చు.


తెలంగాణలో 5 కేంద్రాలు

తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో అనంతపురం, కర్నూలు, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కాకినాడ, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో (18)పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా ఈసారి విదేశాల్లో పరీక్ష నిర్వహించడం లేదు.


గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఈ కొలువుల భర్తీ

కేంద్ర ప్రభుత్వంలోని గ్రూపు ‘ఏ’ స్థాయి డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ఉద్యోగాలను గేట్‌ స్కోర్‌ ఆధారంగా భర్తీ చేయనున్నారు. సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌ తదితర కేబినెట్‌ సెక్రటేరియట్‌లోని కొలువులు భర్తీ చేస్తారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ) ఈ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను ముఖాముఖీకి పిలిచి ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని