ప్రతిపక్షాల తీరు పార్లమెంటుకు అవమానకరం

ప్రధానాంశాలు

ప్రతిపక్షాల తీరు పార్లమెంటుకు అవమానకరం

అర్థవంతమైన చర్చలకు వారు సిద్ధంగా లేరు
విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌, దిల్లీ: పెగాసస్‌ నిఘా వ్యవహారంపై చర్చకు పట్టుపడుతూ పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలతో విరుచుకుపడ్డారు. పార్లమెంటును, రాజ్యాంగాన్ని అవమానించేలా విపక్ష సభ్యులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అర్థవంతమైన చర్చలకు వారు ఏమాత్రం సిద్ధంగా లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మంగళవారం మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాకాల సమావేశాల్లో.. పార్లమెంటు ఉభయ సభల్లో కొందరు ఎంపీలు పేపర్లు చింపి సభాధ్యక్షుల స్థానాల వైపు గాల్లోకి విసిరిన ఘటనలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాట్‌ తయారుచేస్తున్న చందాన ప్రభుత్వం బిల్లులను వేగంగా ఆమోదింపజేసుకుంటోందంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఓబ్రియెన్‌ చేసిన విమర్శనూ తప్పుబట్టారు. విపక్ష సభ్యులు అప్రజాస్వామ్య రీతిలో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

శాసన వ్యవస్థ, ప్రజాప్రతినిధుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రతిపక్ష నేతలు నిందారోపణలు చేస్తున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో తాము ఆమోదిస్తున్న బిల్లులు ప్రజా సంక్షేమానికి ఉద్దేశించినవన్నారు. వాటిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అహంకారపూరిత వైఖరిని ప్రదర్శించినప్పటికీ సహనం కోల్పోవద్దని భాజపా ఎంపీలకు ప్రధాని సూచించారు. ఈ మేరకు ఆయన ప్రసంగ వివరాలను కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, వి.మురళీధరన్‌ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వైద్య విద్యకు సంబంధించిన అఖిల భారత కోటా (ఏఐక్యూ)లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల విద్యార్థులకు రిజర్వేషన్‌ అమలు చేయాలన్న నిర్ణయం తీసుకున్నందుకుగాను మోదీని భాజపా పార్లమెంటరీ పార్టీ ప్రశంసించినట్లు తెలిపారు. మరోవైపు- కరోనాపై పోరాటంలో  ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టేలా భాజపా ఎంపీలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రత్యేక బుక్‌లెట్‌లను అందించారు.


ఆహార నిల్వలు పెరిగినా.. ఆకలి తగ్గలేదు: మోదీ

స్వాతంత్య్రానంతరం రేషన్‌ పథకాల బడ్జెట్‌ భారీగా పెరిగినప్పటికీ.. అదే స్థాయిలో పేదలకు మాత్రం ప్రయోజనం చేకూరలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పంపిణీ వ్యవస్థల్లో లోపాలు, కొన్ని స్వార్థశక్తుల జోక్యమే అందుకు కారణమని విమర్శించారు. గుజరాత్‌ సీఎంగా విజయ్‌ రూపానీ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మోదీ వర్చువల్‌గా హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎం-జీకేఏవై) లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం ప్రసంగిస్తూ.. ‘‘స్వాతంత్య్రానంతరం రేషన్‌ పథకాల పరిధి,  నిధులు ఏటా పెరుగుతూపోయాయి. వాటి సానుకూల ప్రభావం పేదలపై అంతగా పడలేదు. దేశంలో ఆకలి, పోషకాహార లేమి తగ్గలేదు. 2014లో మేం అధికారంలోకి వచ్చాక పరిస్థితులను చక్కదిద్దాం. రేషన్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానించాం. కరోనా మహమ్మారి వేళ పీఎం-జీకేఏవై పథకం ద్వారా రూ.2 లక్షల కోట్ల వ్యయంతో 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత రేషన్‌ అందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ యోజన, ముద్ర యోజన తదితర పథకాల గురించీ ఆయన వివరించారు.


అవి చౌకబారు ప్రచార ఎత్తుగడలు: భాజపా

పార్లమెంటుకు సైకిల్‌పై రావడం, ట్రాక్టర్‌ నడపడం వంటివి రాహుల్‌గాంధీ చేస్తున్న చౌకబారు ప్రచార ఎత్తుగడలని భాజపా విమర్శించింది. దేనిపైనైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా విపక్షాలు అడ్డుకోవడాన్ని తొలిసారిగా చూస్తున్నామని, వార్తల్లో నిలవడం కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి అనిల్‌ బలూని ఆరోపించారు. విపక్ష నేతలు ఎవరికివారు తమను భాజపా వ్యతిరేక శిబిరానికి నాయకునిగా చిత్రీకరించుకునేందుకు పార్లమెంటును అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి నక్వీ విమర్శించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని