కోర్టు ధిక్కరణ కేసులకు ప్రజాధనమా?

ప్రధానాంశాలు

కోర్టు ధిక్కరణ కేసులకు ప్రజాధనమా?

సీఎస్‌కు రూ.58.95 కోట్లు ఏ పద్దు కింద ఇచ్చారు?

విచారణ ముగిసేదాకా నిధులు విడుదల చేయొద్దు

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌పై ఉన్న కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కోవడానికి ఏ పద్దు కింద నిధులను ఖర్చు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. ట్రెజరీ నుంచి ఏ నిబంధనల కింద విడుదల చేస్తున్నారో చెప్పాలంది. ఈ కేసు విచారణ పూర్తయ్యేదాకా జీవో 208 కింద సొమ్ము విడుదల చేయవద్దని స్పష్టంచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌పై ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల విచారణ నిమిత్తం ప్రభుత్వం రూ.58.95 కోట్లు మంజూరు చేస్తూ జూన్‌ 7న జీవో 208 జారీ చేసిందంటూ.. దాన్ని సవాలు చేస్తూ మహబూబ్‌నగర్‌కు చెందిన సీహెచ్‌.ప్రభాకర్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ సోమేశ్‌కుమార్‌పై 2013 నుంచి 2021 వరకు మొత్తం 181 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని, మరికొన్ని సీసీఎల్‌ఏపై ఉన్నాయని చెప్పారు. సోమేశ్‌కుమార్‌పై ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల నిమిత్తం నిధులు విడుదల చేయాలంటూ సీసీఎల్‌ఏ అభ్యర్థించారని, దీనికి ఆర్థికశాఖ అనుమతించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సోమేశ్‌కుమార్‌పై ఉన్న కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం రూ.58.95 కోట్లను కేటాయించిందన్నారు. ప్రతి కేసుకు రూ.32.57 లక్షలు కేటాయించిందన్నారు. ఇది సరైన మొత్తమే అనుకున్నప్పటికీ.. జీవోపై సంతకం చేసిన వ్యక్తే లబ్ధిదారుగా ఉండటం గమనార్హమన్నారు. (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)గా కూడా వ్యవహరిస్తున్నారు.) సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టడం చెల్లదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఈ జీవో ఏమిటని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ను ప్రశ్నించింది. రూ.58.95 కోట్లు ఎందుకని, అసలు పెండింగ్‌ కోర్టు ధిక్కరణ కేసులంటే ఏమిటని అడిగింది. దేని కింద ఖర్చు పెడుతున్నారో చెప్పాలంది. ఇది ప్రజాధనమని, వివరణ తెలుసుకోకుండా అనుమతించలేమని స్పష్టంచేసింది. ప్రతివాదులైన రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ట్రెజరీ డైరెక్టర్‌, సీసీఎల్‌ఏలకు, వ్యక్తిగత హోదాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను, రెండు వారాల్లో బదులివ్వాలని పిటిషనర్‌ను ఆదేశించింది. విచారణను అక్టోబరు 27కి వాయిదా వేసింది.

భూసేకరణ పరిహారం చెల్లింపుల కోసమే: సీఎస్‌

కోర్టుల్లో పెండింగ్‌ భూసేకరణ కేసుల్లో పరిహారం చెల్లింపుల కోసమే ప్రభుత్వం రూ.58.95 కోట్లు మంజూరు చేసిందంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. భూసేకరణ కేసుల అప్పీళ్లకు సంబంధించి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జి రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా తీసుకుని హైకోర్టు విచారణ చేపట్టిందన్నారు. అది పెండింగ్‌లో ఉందని..అందులో చెల్లింపుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. దీన్ని పిటిషనర్‌ తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ మొత్తం కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదని స్పష్టంచేశారు. కాగా, సీఎస్‌ అఫిడవిట్‌ దాఖలు చేసే సమయానికి కేసు వాయిదా పడింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని