ఆసరా వయసుపై ఉత్తర్వుల జారీ

ప్రధానాంశాలు

ఆసరా వయసుపై ఉత్తర్వుల జారీ

సర్వే అనంతరం 57 ఏళ్లకే వృద్ధాప్య పింఛను మంజూరు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛను (ఆసరా) అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు కుటుంబంలో ఒకరిని గుర్తించి అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ఇటీవల మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దానిప్రకారం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు (జీవోనెం.36) జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేపట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవోను ఆదేశించారు. అర్హత పొందిన వారికి నెలకు రూ.2,016 చొప్పున అందిస్తారు. అర్హుల గుర్తింపు సర్వే, పింఛన్ల మంజూరు మార్గదర్శకాలు త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం.

గత సర్వేలో 8.5 లక్షల మంది అర్హులు...

తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో 57 ఏళ్లు దాటిన వారి గుర్తింపు ప్రక్రియ చేపట్టింది. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా మేరకు 57 ఏళ్లు దాటిన వారిని ఇంటింటి సర్వే ద్వారా లెక్కించింది. ఈ సర్వే ప్రకారం 8.5 లక్షల మంది ఉన్నట్లు వెల్లడైంది. ప్రభుత్వం 57 - 65 ఏళ్ల మధ్య అర్హులైన వారు 6.6 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తోంది.  ప్రస్తుత గణాంకాల మేరకు సెర్ప్‌ పరిధిలో 65 ఏళ్లు దాటిన 37.48లక్షల మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు.

ఆసరా పొందాలంటే...!

* వయసు గుర్తింపు పత్రం తప్పనిసరి. గుర్తింపు పత్రం లేకుంటే కుటుంబ సభ్యుల వయసును ఆధారంగా తీసుకొని లెక్కిస్తారు.

* మూడెకరాలకు మించి తరి, 7.5 ఎకరాలకు మించి మెట్ట భూములున్న వ్యక్తులు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేటు, పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగులుగా పిల్లలు ఉన్నవారు అనర్హులు. సొంత దుకాణాలు, సంస్థలు ఉండకూడదు. తనిఖీ అధికారి వృద్ధుల జీవనశైలిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.

* ఫొటో, ఆధారునంబరు, బ్యాంకు పాసుపుస్తకం, వయసు ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకుంటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అధికారులు  పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. గ్రామాల్లో ఎంపీడీవోలు, హైదరాబాద్‌లో తహసీల్దార్‌లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో డిప్యూటీ కమిషనర్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు నిర్ణయం తీసుకుంటారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని