జయహో సింధు

ప్రధానాంశాలు

జయహో సింధు

హైదరాబాద్‌లో భారత స్టార్‌కు ఘన స్వాగతం

శంషాబాద్‌, న్యూస్‌టుడే: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో అదరగొట్టిన భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధుకు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలతో మెరిసిన సింధు బుధవారం హైదరాబాద్‌ చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌, శాట్స్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, క్రీడల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, ఎయిర్‌పోర్ట్‌ సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ విమానాశ్రయంలో సింధుకు స్వాగతం పలికి సత్కరించారు. సింధుతో పాటు ఆమె కోచ్‌ పార్క్‌ను మంత్రి అభినందించారు. భారత స్టార్‌ బయటకు రాగానే క్రీడాభిమానులు ‘సింధు.. సింధు’ అని నినాదాలు చేస్తూ విమానాశ్రయాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. భవిష్యత్తులో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరిన్ని పతకాలు అందించడమే తన లక్ష్యమని చెప్పారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహకాలు, సౌకర్యాల కారణంగానే ఒలింపిక్స్‌ లాంటి అత్యున్నత వేదికల్లో రాణిస్తామన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. సింధు ఘనత తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో ఆమె స్వర్ణం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల హబ్‌గా మార్చడానికి సీఎం కేసీఆర్‌ కార్యాచరణ రూపొందిస్తున్నారని, క్రీడాకారులకు, కోచ్‌లకు మరింత ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. సింధు రాక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్లిన సింధుకు కుటుంబ సభ్యులు హారతితో స్వాగతం పలికారు. సింధు నడుస్తుంటే.. ఆమెపై పూలు చల్లుతూ స్వాగతం చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని