కోర్టుల్లో 3.93 కోట్ల పెండింగ్‌ కేసులు

ప్రధానాంశాలు

కోర్టుల్లో 3.93 కోట్ల పెండింగ్‌ కేసులు

కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడి

దేశంలో న్యాయవ్యవస్థలో మౌలికవసతుల అభివృద్ధికి వచ్చే అయిదేళ్లలో రూ.9వేల కోట్లు ఖర్చుచేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఇందుకోసం 1993లో కేంద్ర ప్రాయోజిత పథకం మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.8,644 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. బుధవారం లోక్‌సభలో నిజామాబాద్‌ భాజపా సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.  జులై 30 నాటికి దేశవ్యాప్తంగా కిందిస్థాయి కోర్టుల్లో 3.93 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. అందులో 30 ఏళ్లకు పైబడినవి 1,02,001 ఉన్నట్లు వెల్లడించారు.


సుప్రీంకోర్టు విభజన అంశం కోర్టు పరిధిలో ఉంది

సుప్రీంకోర్టు విభజన అంశం సర్వోన్నత న్యాయస్థానం ముందుందని, దానిపై తామేమీ చెప్పలేమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు తెలిపారు. సుప్రీంకోర్టును రాజ్యాంగ న్యాయస్థానం, కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌గా విభజించి.. దిల్లీతోపాటు దేశం నాలుగు మూలల్లో ఏర్పాటు చేయాలన్న లాకమిషన్‌ సిఫార్సుల అమలుపై చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డి బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు.  


153 పేర్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు కొలీజియం

న్యాయమూర్తుల నియామకం కోసం హైకోర్టులు పంపిన ప్రతిపాదనల్లో 153 పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు. ‘‘2018-20 మధ్య మూడేళ్లలో హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం హైకోర్టుల కొలీజియంలు 505 పేర్లు ప్రతిపాదించగా అందులో సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన 209 మంది న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. మరో 153 పేర్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మిగిలిన 143 పేర్లకు తోడు 94 కొత్త ప్రతిపాదనలు హైకోర్టు కొలీజియంల నుంచి ఈ ఏడాది అందాయి’’ అని కిరణ్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని