ప్రభుత్వ భూములకు ‘జియో’ రికార్డులు తయారు చేయండి

ప్రధానాంశాలు

ప్రభుత్వ భూములకు ‘జియో’ రికార్డులు తయారు చేయండి

జిల్లా కలెక్టర్లకు హైకోర్టు ఆదేశం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నట్లు తరచూ ఈ కోర్టు దృష్టికి వస్తోంది. ఒకవైపు ప్రభుత్వం ల్యాండ్‌ బ్యాంక్‌లను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ఆక్రమణలకు గురవుతున్న భూమిని రక్షించలేక వేలం వేస్తోంది. సర్కారు వైఖరి అర్థం కావడంలేదు. ఆక్రమణల గురించి ప్రైవేటు వ్యక్తులు దృష్టికి తీసుకువచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం.

- హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని ప్రభుత్వ భూములపై నిర్దిష్ట గడువులోగా జియో మ్యాపింగ్‌ పద్ధతిలో సర్వే నిర్వహించి రికార్డు రూపొందించాలని జిల్లా కలెక్టర్లకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తక్షణం సర్వే ప్రారంభించి పూర్తయ్యేదాకా వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని చెప్పింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రజ్ఞాన్‌పూర్‌లో సర్వే నం.356లోని ప్రభుత్వ భూమిని ఎం.విజయ్‌కుమార్‌, సీహెచ్‌ లక్ష్మీనీహారికలు ఆక్రమించుకున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ సీహెచ్‌ రాజు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. గత జనవరిలో ఆక్రమణల తొలగింపుపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని ఆదేశించినా ఇప్పటివరకు దాఖలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణపై ఏదైనా ఫిర్యాదు అందితే వెంటనే సర్కారు చర్యలు తీసుకుంటోందని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ చెప్పారు. ఇప్పటికే గుర్తించిన భూములపై సెక్షన్‌ 21ఎ కింద రిజిస్ట్రేషన్‌ను నిషేధిస్తూ సబ్‌రిజిస్ట్రార్‌లకు సమాచారం ఇచ్చామన్నారు. ‘‘ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలి.  జియో రికార్డు రూపొందించాక ఆ ప్రకారం భూముల వివరాలను సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌లకు పంపాలి. ఆ భూములకు సంబంధించి ఎవరన్నా తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌కు వస్తే వారు నిలువరించాలి. అనుమానం వస్తే కలెక్టర్‌ కార్యాలయం నుంచి స్పష్టత తీసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ భూమిని గుర్తించి ఉన్నట్లయితే ఆ వివరాలను సబ్‌రిజిస్ట్రార్‌లకు పంపాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే ఆక్రమణలు తొలగించడానికి తీసుకున్న.. తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్లు విడివిడిగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 27వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని