20 కోట్లు దాటిన కేసులు

ప్రధానాంశాలు

20 కోట్లు దాటిన కేసులు

ప్రపంచంలో కరోనా విలయం

మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి

జెనీవా: కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకు పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య బుధవారం 20 కోట్లు దాటింది. కరోనా దెబ్బకు ఇంతవరకు 42.63 లక్షల మంది బలైపోయారు. ప్రపంచవ్యాప్త కొవిడ్‌ కేసుల్లో 43.79% (8.78 కోట్లకు పైగా) అమెరికా, భారత్‌, బ్రెజిల్‌లలోనే నమోదయ్యాయి. 2019 ఆఖరులో చైనాలోని వుహాన్‌ నగరంలో తొలిసారి బయటపడిన కరోనా వైరస్‌ 19 నెలలుగా 200కి పైగా దేశాలను చుట్టుముట్టింది. ప్రపంచంలో మొదటి ఉద్ధృతి ఈ ఏడాది జనవరిలో అత్యంత తీవ్రస్థాయికి చేరగా ఫిబ్రవరి చివరివారం నాటికి తగ్గుముఖం పట్టింది. రెండో ఉద్ధృతి క్రమేపీ ఉగ్రరూపం దాల్చి ఏప్రిల్‌ ఆఖరు నాటికి తీవ్రస్థాయికి చేరింది. జూన్‌ నెలాఖరు సరికి కొంత తగ్గి ఊరటనిచ్చినా.. గత నెల రోజులుగా ఉధ్ధృతి పెరుగుతోంది. కరోనా కల్లోలంతో అల్లాడిన అమెరికాలోను.. కొవిడ్‌ కట్టడిలో విజయవంతమైన చైనాలోనూ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో రెండో ఉద్ధృతి కొనసాగుతుండగా జులైలో సగటున రోజుకు 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గత వారంలో ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల కేసులు నమోదయ్యాయి.

* గత వారంలో అమెరికా, భారత్‌, ఇండొనేసియా, బ్రెజిల్‌, ఇరాన్‌లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. డెల్టా రకం కేసులు 130కి పైగా దేశాల్లో నమోదవుతున్నాయి.

* ఇండొనేసియాలో గత 24 గంటల్లో 1,747 మంది కొవిడ్‌తో మృతి చెందారు.

* ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కేసులు, మరణాలు నమోదైన అమెరికాలో జూన్‌ నాటికి మహమ్మారి ఉద్ధృతి గణనీయంగా తగ్గింది.  గత కొద్ది రోజులుగా మాత్రం ఇక్కడ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మంగళవారం లక్షకు పైగా కొత్త కేసులు బయటపడగా.. 516 మంది మృతి చెందారు.

* ప్రపంచంలో కొవిడ్‌ మరణాలు ఎక్కువగా సంభవించిన తొలి 6 దేశాల్లో వరుసగా అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, మెక్సికో, పెరూ, రష్యాలు ఉన్నాయి. కొవిడ్‌ బారిన పడినవారిలో ఇంతవరకు 18.07 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. 1.55 కోట్లకు పైగా క్రియాశీలక కేసులున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని