ఆది నుంచీ పులి‘చింతలే’

ప్రధానాంశాలు

ఆది నుంచీ పులి‘చింతలే’

 డిజైన్‌ నుంచి పనుల వరకూ అన్నింటా సమస్యలే

33 గేట్లకు బదులు 24 గేట్లతోనే ప్రాజెక్టు నిర్మాణం

కాంక్రీటు డ్యాంకు బదులు మట్టికట్టతో సరి

గేట్ల మధ్య భారీగా పెరిగిన దూరం

ప్రస్తుత ఘటనకు అనేక కారణాలు

ఈనాడు - హైదరాబాద్‌

పులిచింతల నిర్మాణంలో ఆది నుంచీ లోపాలే. డిజైన్‌ ఖరారు మొదలుకొని పనుల వరకూ అన్నింటిలో సమస్యలే. ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించిన ప్రతి నిపుణుల కమిటీ లోపాలను ఎత్తిచూపినా, పనులు సక్రమంగా జరిగేలా చూడాల్సిన నీటి పారుదలశాఖ చూసీచూడనట్లు వ్యవహరించింది. బయటపడ్డ లోపాలను సవరించే ప్రయత్నం చేయకపోవడంతో కొత్త ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగానే గేటుకు నష్టం వాటిల్లింది. నిల్వ చేసిన విలువైన నీటిని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. నీటి పారుదలశాఖ సమాచారం ప్రకారం పులిచింతలలో 24 గేట్ల నిర్మాణం జరగ్గా, ఒక్కొక్కటి 18.5/17 మీటర్లు. అన్ని గేట్లూ ఇలా ఉంటేనే సమతౌల్యం దెబ్బతినకుండా నీటి ఒత్తిడిని భరించే శక్తి గేట్లకు ఉంటుంది. ఇక్కడ అందుకు భిన్నంగా జరిగిందని, ఒక గేటుకు ఇంకో గేటుకు పొంతన లేదన్నది నిపుణుల అభిప్రాయం.

గేట్లను అమర్చడానికి నిర్మించే పియర్స్‌లో ఒక గేటుకు, ఇంకో గేటుకు మధ్య గ్యాప్‌ గరిష్ఠంగా ఆరు మిల్లీమీటర్లకు మించి ఉండరాదని, కానీ పులిచింతలలో 400 మిల్లీమీటర్లకు పైగా ఉందని పనులను పరిశీలించిన నిపుణుడొకరు తెలిపారు. పైపెచ్చు ఏ రెండు పియర్స్‌ మధ్య ఒకేలా లేకపోవడాన్నీ గుర్తించారు. ఇంత అసమతుల్యంగా ఉండటంతో గేటు టాలరెన్స్‌ (భరించడం) కష్టం. పక్క పక్క గేట్లపైనే పడే లోడ్‌ తేడా ఉంటుంది. ఇలాంటి చాలా లోపాలను నిపుణుల కమిటీలు గుర్తించాయని ఈ కమిటీల్లో సభ్యునిగా ఉన్న నిపుణడొకరు పేర్కొన్నారు. పియర్స్‌ మధ్య తేడా ప్రభావం గేట్ల మీద పడిందని మరో నిపుణుడు వ్యాఖ్యానించారు. ఒక పియర్‌కు ఇంకో పియర్‌కు మధ్య గ్యాప్‌ మాత్రమే కాదు, పియర్స్‌లో తేడాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో అనేక లోపాలున్నాయన్నది నిపుణుల అభిప్రాయం. ‘సివిల్‌ పనుల్లో లోపాలుండొచ్చు లేదా మెకానికల్‌ పనుల్లో తేడాలుండొచ్చు, రెండింటిలోనూ సమస్యలు ఉండే అవకాశం ఉంది. వీటన్నిటితోపాటు కాంక్రీటు నాణ్యత, మెకానికల్‌ పనుల అలైన్‌మెంట్‌.. ఇలా అన్ని అంశాలనూ క్షణ్ణంగా పరిశీలించాలి’ అని డిజైన్లలో అనుభవం ఉన్న ఓ సీనియర్‌ ఇంజినీరు వ్యాఖ్యానించారు. డ్యాంలో ఐదారు మీటర్ల నీళ్లు నింపగానే సీపేజీ ప్రారంభమై గ్యాలరీ నిండా నీళ్లే. పది మీటర్ల వరకూ నింపితే అక్కడివరకూ గ్యాలరీ నిండిపోయింది. డ్యాంకు ఏమవుతుందో అని భయపడి రెండు రోజులు రాత్రిళ్లు అక్కడే పడుకొని పర్యవేక్షించానని ఐదేళ్ల క్రితం ఆ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలను నిర్వహించి పదవీ విరమణ చేసిన ఓ ఇంజినీరు తెలిపారు. గ్రౌటింగ్‌ చేయకపోవడంవల్ల ఈ సమస్య తలెత్తింది. నిపుణులను పిలిపించి మళ్లీ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ఈ పని చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలోనే అన్ని రకాల వైఫల్యాలు ఉన్నాయని విశ్రాంత చీఫ్‌ ఇంజినీరు, డిజైన్స్‌ నిపుణులు రౌతు సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. పని సరిగా లేకపోవడం గురించి గుత్తేదారును అడిగితే, మేము చేసే దాంట్లో లోపాలుంటే డిపార్టుమెంటు ఏం చేస్తుంది, ప్రశ్నించాలి కదా అంటారు. ఇంజినీర్లను అడిగితే ‘ఈపీసీ’ పద్ధతి కాబట్టి డిజైన్‌ నుంచి నిర్మాణం వరకూ అన్నీ తమ బాధ్యతేనని గుత్తేదారు సమాధానమిస్తున్నారని చెప్పారని, ఇలాంటి పరిస్థితి ఎక్కడా చూడలేదని నిపుణుల కమిటీలో భాగంగా ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మరో సీనియర్‌ ఇంజినీరు పేర్కొన్నారు. జరిగిన సంఘటన ఆశ్చర్యకరం కాదని, ఊహించినదేనని... ఇప్పటికైనా అన్ని గేట్లనూ నిశితంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఓ సీనియర్‌ ఇంజినీరు వ్యాఖ్యానించారు. చెరుకూరి వీరయ్య, సుబ్బారావు, రౌతు సత్యనారాయణ ఇలా అనేకమంది నీటి పారుదల రంగ నిపుణులు ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించి పలు అంశాలను ప్రభుత్వానికి నివేదించారు. కానీ వీటిలో అమలు జరిగినవి తక్కువే.


ఆరంభంలోనే..

45.77 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి 2004లో శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌-సీఆర్‌18జీ సంస్థతో ఈపీసీ పద్ధతిలో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పర్యావరణ అనుమతి ఆలస్యం కావడంతో 2005 జూన్‌లో పని ప్రారంభమైంది. ఒప్పందం ప్రకారం 1289 మీటర్ల కాంక్రీటు డ్యాం నిర్మాణం, ఇందులో 754.59 మీటర్ల దూరం స్పిల్‌వే నిర్మాణాన్ని 33 గేట్లతో చేపట్టాలి. అయితే ఈపీసీ పేరుతో డ్యాం డిజైన్‌ మార్చి స్పిల్‌వేను 546 మీటర్లకు తగ్గించడంతో గేట్ల సంఖ్య 24కు తగ్గింది. కాంక్రీటు డ్యాం బదులు 355 మీటర్ల మట్టికట్ట నిర్మాణం చేపట్టారు. దీనివల్ల తగ్గే మొత్తం ఈపీసీ కాబట్టి గుత్తేదారుకే వెళ్తుంది. కాంక్రీటు డ్యాంకు ఒప్పందం చేసుకుని మట్టికట్ట నిర్మించడాన్ని 2006 ఫిబ్రవరి 11న ‘కాంక్రీటు పోయి మట్టి వచ్చే డ్యాం..డ్యాం..డ్యాం’ శీర్షికన ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. అయితే నీటి పారుదలశాఖ నిర్ణయాన్ని అప్పటి పెద్దలు సమర్థించుకున్నా, తర్వాత 33 గేట్లతోనే పని చేయించాలని నీటి పారుదలశాఖ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ కార్పొరేషన్‌ అధికారులతో కమిటీ వేసి చర్చించింది. చివరకు ఒత్తిడికి తలొగ్గి స్పిల్‌వేను తగ్గించి 24 గేట్లతోనే నిర్మించింది. నిర్మాణ సమయంలో జరిగిన లోపాలనూ ఎప్పటికప్పుడు ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మాత్రం 2005లో ఇచ్చిన పరిపాలనా అనుమతి కంటే 300% పెరిగింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని