మక్క బుట్టల అంకాపూర్‌

ప్రధానాంశాలు

మక్క బుట్టల అంకాపూర్‌

  మొక్కజొన్న కంకులకు ఏకైక మార్కెట్‌

ఐదు దశాబ్దాల క్రితమే సొంతంగా ఏర్పాటు చేసుకున్న రైతులు

  సీజన్‌లో రూ.50 కోట్లకు పైగా వ్యాపారం

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: పత్తికి వరంగల్‌ ఎనుమాముల, ఉల్లిగడ్డకు మలక్‌పేట్‌, కూరగాయలకు మోండా మార్కెట్‌ ఎలా ప్రసిద్ధి చెందాయో.. మక్క బుట్టలకు నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ అంతలా గుర్తింపు పొందింది. రాష్ట్రంలో ఏకైక పచ్చి మక్క బుట్టల సంత ఇది. ప్రాంతాలను బట్టి మొక్కజొన్న పొత్తులు.. మొక్కజొన్న కంకులు...మక్కబుట్టలు అని వ్యవహరిస్తూ ఉంటారు. ప్రధానంగా  ఉత్తర తెలంగాణలో మక్క బుట్టలు అనేది బాగా వ్యవహారంలో ఉంది. తెలంగాణలోని హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మంచిర్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాలు; సమీపాన మహారాష్ట్రలోని లాథూర్‌, నాగ్‌పుర్‌, నాందేడ్‌, చంద్రాపూర్‌, కిన్వట్‌; ఆంధ్రప్రదేశ్‌లో రాజమహేంద్రవరం, ఏలూరు తదితర నగరాలు, పట్టణాలకు ఇక్కడి నుంచే సరఫరా అవుతాయి. ఇక్కడ ఒక్క సీజన్‌కు రూ.50 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ ఐదు దశాబ్దాలుగా సంత నడుస్తోంది. స్థానిక రైతులు ఎంతో శ్రమించి సొంతంగా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించుకున్నారు.  1970లో జాతీయ రహదారి పక్కన గ్రామస్థులు సొంతంగా మార్కెట్‌ ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులు పచ్చి ఆటోలు, డీసీఎం వ్యాన్లలో కంకులు తెచ్చి విక్రయిస్తారు. జిల్లాలో పది వేలకు పైగా ఎకరాల్లో సాగుచేస్తారు. జులై నుంచి అక్టోబరు వరకు రోజు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హోల్‌సేల్‌ విక్రయాలు జరుగుతాయి. స్థానిక వ్యాపారులు కుప్పగా పోసి డజన్ల లెక్కన విక్రయిస్తారు. వర్షం పడి వాతావరణం చల్లబడితే ఒక ధర, పొడి వాతావరణం ఉంటే మరో ధర ఉంటుంది. ఒక్క ఆటో ట్రాలీలో 1200కు పైగా కంకులుంటాయి. డిమాండును బట్టి రూ.4 వేల నుంచి 7 వేల వరకు ధర లభిస్తుంది. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రైతుకు ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం లభిస్తుంది.

హమాలీగా వచ్చి వ్యాపారినయ్యా

‘‘నేను పదేళ్ల కిందట హమాలీగా వచ్చా. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, లాథూర్‌, నాగ్‌పుర్‌, నాందేడ్‌ తదితర ప్రాంతాల్లో వీటికి డిమాండు ఉంది. దాంతో వ్యాపారిగా మారా. రెండ్రోజులకు 5 టన్నుల చొప్పున తీసుకెళ్లి విక్రయిస్తున్నా’’ అని వర్తకుడు అమోల్‌ తెలిపారు. గంపగుత్తగా మక్క బుట్టలు దొరికేది ఇదొక్కచోటేనని.. నిత్యం 10 టన్నులు తీసుకెళ్లి విక్రయిస్తానని హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి మహ్మద్‌ యూసుఫ్‌ వివరించారు. స్థానికంగా మార్కెట్‌ లేక గతంలో తాము ఎడ్ల బండ్లపై కంకులు తీసుకెళ్లి నిజామాబాద్‌లో విక్రయించేవాళ్లమని, ప్రత్యేకంగా సంత లేకపోవడంతో అక్కడా అంతగా ధర దక్కేదికాదని అంకాపూర్‌ మాజీ సర్పంచి, రైతు గడ్డం రాజన్న తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని