పార్లమెంట్‌లో తెలంగాణ సమాచారం

ప్రధానాంశాలు

పార్లమెంట్‌లో తెలంగాణ సమాచారం

రూ.10 వేల కోట్లతో 736 జలవనరుల పునరుద్ధరణ

ఈనాడు, దిల్లీ: దేశంలోని 736 జలవనరులను రూ.10,211 కోట్లతో పునరుద్ధరించనున్నట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ గురువారం లోక్‌సభలో వెల్లడించారు. జలవనరుల పునరుద్ధరణ, అభివృద్ధి పథకం (డ్రిప్‌) కింద ఈ పనులు చేపట్టనున్నామని, వీటిలో 227 ప్రాజెక్టులు 100 ఏళ్లకుపైబడినవి కూడా ఉన్నాయని వివరించారు. రూ.545 కోట్లతో 29 ప్రాజెక్టులకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. పునరుద్ధరిస్తున్న వాటిలో తెలంగాణలో 18, ఏపీలో 5 ప్రాజెక్టులు 100 ఏళ్లకు పైబడినవి ఉన్నట్లు తెలిపారు.

తెలంగాణలో 100 ఏళ్లకు పైబడిన ప్రాజెక్టులు

శనిగరం-కోహెడ మండలం (1891 సంవత్సరంలో నిర్మాణం), పెద్దచెరువు-పెద్దమల్లారెడ్డి (1892), పెద్దచెరువు-కచాపూర్‌ (1896), పెద్దచెరువు-కామారెడ్డి (1897), పెద్దచెరువు-మల్కాపూర్‌ (1898), పెద్దచెరువు-జంగంపల్లి (1898), పెద్దచెరువు-అడ్లూర్‌ఎల్లారెడ్డి (1901), పాకాల చెరువు-ఉమ్మడి వరంగల్‌ జిల్లా (1902), మల్లారెడ్డిచెరువు-భిక్కనూరు (1905), ఉదయసముద్రం-ఉమ్మడి నల్గొండ జిల్లా (1906), చౌదరిచెరువు-పోల్కంపేట్‌ (1908), లక్నవరం చెరువు-ఉమ్మడి వరంగల్‌ జిల్లా (1909), పెద్దచెరువు-బీబీపేట్‌ (1911), పెద్దచెరువు-వెల్లుట్ల (1912), పెద్దచెరువు-పుల్కల్‌ (1918), పెద్దచెరువు-ఉప్పలవాయ్‌ (1918), రామప్పచెరువు-ఉమ్మడి వరంగల్‌ జిల్లా (1919) ఉస్మాన్‌సాగర్‌-హైదరాబాద్‌ (1920).
ఏపీలో..కంభం (1500), తోటపల్లి బ్యారేజీ (1908), దొండపాడు చెరువు (1910), సిద్దాపురం చెరువు (1919), మోపాడు రిజర్వాయర్‌ (1921)


87% పీఎంఏవైయూ ఇళ్లు పూర్తయ్యాయ్‌

తెలంగాణలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ ఇళ్లలో 87% పూర్తయ్యాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో తెరాస లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ పథకం కింద తెలంగాణకు 2,24,206 ఇళ్లు కేటాయించగా గతంలో జేఎన్‌యూఆర్‌ఎంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లతో కలిపి 2,35,597 గృహాలు నిర్మాణం మొదలయ్యాయన్నారు. 2,05,120 ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందించారని వెల్లడించారు.


జాతీయ రహదారులుగా 7 మార్గాలు: గడ్కరీ

గత ఏడాది కాలంలో తెలంగాణలో 796 కిలోమీటర్ల పొడవైన 7 మార్గాలను జాతీయ రహదారులుగా ప్రకటించినట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. 2018-19, 2019-20 సంవత్సరాల్లో ఏ ఒక్క మార్గాన్నీ జాతీయ రహదారిగా ప్రకటించలేదని, 2020-21లో మాత్రం ఏడింటిని ప్రకటించామని తెలిపారు.


‘బేగంపేట’లో పౌరవిమానయాన పరిశోధన సంస్థ

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో రూ.402 కోట్లతో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పౌరవిమానయాన పరిశోధన సంస్థ (సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌)ను ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గురువారం లోక్‌సభలో చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విమానాశ్రయాలు, ఎయిర్‌ నేవిగేషన్‌ సర్వీసెస్‌కు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలను అక్కడ నెలకొల్పనున్నట్లు చెప్పారు. 2023 డిసెంబర్‌ నాటికి ఈ పరిశోధన సంస్థ నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి బేగంపేట విమానాశ్రయంలో ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని