కొవిడ్‌ టీకా ఉత్పత్తికిఅరబిందో ఫార్మా సన్నాహాలు

ప్రధానాంశాలు

కొవిడ్‌ టీకా ఉత్పత్తికిఅరబిందో ఫార్మా సన్నాహాలు

  వైరల్‌ వ్యాక్సిన్స్‌ యూనిట్‌ వచ్చే నెలలో ప్రారంభం

‘వ్యాక్సినిటీ’తో లైసెన్సింగ్‌ ఒప్పందం

దిల్లీ: కొవిడ్‌-19 టీకా ఉత్పత్తిని సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని అరబిందో ఫార్మా సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌ సమీపంలో సిద్ధం చేస్తున్న వైరల్‌ వ్యాక్సిన్స్‌ యూనిట్‌ను వచ్చే నెలాఖరు నాటికి ప్రారంభించాలని భావిస్తోంది. ‘మాకున్న  శక్తియుక్తులన్నింటినీ కొవిడ్‌-19 టీకా ఉత్పత్తి కోసం కేంద్రీకరిస్తున్నాం’ అని అరబిందో ఫార్మా వైస్‌ఛైర్మన్‌ ఎన్‌.నిత్యానందరెడ్డి తెలిపారు. అమెరికాకు చెందిన వ్యాక్సినిటీ అనే సంస్థతో కొవిడ్‌-19 టీకా ఉత్పత్తికి అరబిందో ఫార్మా లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ మల్టీటోప్‌ పెప్టైడ్‌ ఆధారిత కొవిడ్‌-19 టీకా (యూబీ612) ను ఆవిష్కరించింది. దీనిపై రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్షలను మనదేశంలో నిర్వహించడానికి వ్యాక్సినిటీ భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. ఈ కసరత్తు త్వరగా పూర్తయితే టీకా ఉత్పత్తి చేసే అవకాశం లభిస్తుందని అరబిందో ఫార్మా భావిస్తోంది. ఇదే కాకుండా బయోసిమిలర్‌ ఔషధాల ఉత్పత్తి పెంచాలని, ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) ఔషధాల శ్రేణిని అధికం చేయాలని యాజమాన్యం ఆలోచనగా ఉంది. ఇంజక్టబుల్‌ ఔషధాలను అధికంగా ఉత్పత్తి చేయడం కోసం అమెరికాలో ఈ సంస్థ ఒక యూనిట్‌ను నిర్మిస్తోంది. విశాఖపట్నంలో మరొకటి ఏర్పాటు చేసే యత్నాల్లో ఉంది. ఈ యూనిట్‌ నుంచి ఐరోపా విపణికి ఇంజక్టబుల్‌ ఔషధాలు ఎగుమతి చేయాలని భావిస్తోంది. విశాఖ యూనిట్‌ ఏడాదిన్నర వ్యవధిలో సిద్ధమవుతుందని అంచనా వేస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని