‘కొవాగ్జిన్‌’కు హంగేరీ నుంచి జీఎంపీ గుర్తింపు

ప్రధానాంశాలు

‘కొవాగ్జిన్‌’కు హంగేరీ నుంచి జీఎంపీ గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌కు చెందిన ‘కొవాగ్జిన్‌’ టీకాకు హంగేరీ నుంచి జీఎంపీ (గుడ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌) గుర్తింపు పత్రం లభించింది. ‘‘హంగేరీ లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ అండ్‌ న్యూట్రిషన్‌ నుంచి ఈ గుర్తింపు లభించింది’’ అని భారత్‌ బయోటెక్‌ ట్వీట్‌ చేసింది. ఈ పత్రం యూడ్రోజీఎండీపీ డేటాబేస్‌లో కనిపిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ‘కొవాగ్జిన్‌’కు అత్యవసర అనుమతి (ఈయూఏ) కోసం దరఖాస్తు చేయనున్నట్లు వివరించింది.

కఠినమైన నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నాం

‘కొవాగ్జిన్‌’ నాణ్యత విషయంలో ఎంతో కఠినమైన పద్ధతులు అవలంబిస్తున్నామని, 250 పరీక్షలు నిర్వహిస్తున్నామని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. ఒక్కో బ్యాచ్‌ టీకా శాంపిళ్లను తుది పరీక్షల కోసం సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీకి పంపుతున్నట్లు, ఆ తర్వాతే మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. టీకా నాణ్యతపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ, ఇప్పటివరకు విడుదల చేసిన కొవాగ్జిన్‌ బ్యాచ్‌లన్నీ హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలోని తమ యూనిట్‌లో కఠినమైన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉత్పత్తి చేసినవేనని స్పష్టంచేసింది. కర్ణాటక, గుజరాత్‌లోని యూనిట్ల నుంచి వచ్చే నెలలో టీకా డోసుల   సరఫరా ప్రారంభం అవుతుందని వివరించింది.


‘స్పుత్నిక్‌-వి’ పంపిణీపై కేంద్రం దృష్టి
- డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌తో ఆరోగ్య మంత్రి సమావేశం

దిల్లీ: దేశంలో ‘స్పుత్నిక్‌-వి’ టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ టీకా ఉత్పత్తి-సరఫరా ఎంత, పంపిణీ స్థితిగతులు ఎలా ఉన్నాయి.. వంటి అంశాలపై చర్చించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డితో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం సమావేశమయ్యారు. రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుని స్పుత్నిక్‌-వి టీకాను మనదేశంలో డాక్టర్‌ రెడ్డీస్‌ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.  మనదేశంలో ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు నుంచి ఈ టీకా ఉత్పత్తి చేస్తారని అంచనా.

పానేషియా బయోటెక్‌ 2.5 కోట్ల డోసులు

దేశీయ ఔషధ సంస్థ పానేషియా బయోటెక్‌ 2.5 కోట్ల డోసుల స్పుత్నిక్‌-వి టీకా ఉత్పత్తి చేయనుంది. ఇందుకు రష్యాకు చెందిన జెనేరియమ్‌ అనే కంపెనీ అందించే ముడి రసాయనాలను వినియోగిస్తుంది. ఈ మేరకు  ఒప్పందం కుదుర్చుకున్నట్లు  సంస్థ వెల్లడించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని