ధరల దడదడ.. కాసుల గలగల

ప్రధానాంశాలు

ధరల దడదడ.. కాసుల గలగల

 పెట్రోలు, డీజిలు ధరలు పెరిగే కొద్దీ ఖజానాకు పెరుగుతున్న ఆదాయం

35.2 శాతం అమ్మకం పన్ను కారణం

ఈనాడు, హైదరాబాద్‌: పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగే కొద్దీ రాష్ట్ర ప్రభుత్వానికి వీటి అమ్మకం ద్వారా వచ్చే రాబడి పెరుగుతోంది. జులైలో రాష్ట్రానికి పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకం పన్ను ద్వారా రికార్డు స్థాయిలో రూ.1100 కోట్లు వచ్చింది. గత ఏప్రిల్‌లో కూడా రూ.వెయ్యి కోట్లు మించి ఈ రాబడి రూ.1058 కోట్లుగా నమోదైంది. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జులై ఆఖరు వరకూ పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకం పన్ను ద్వారా రాష్ట్రానికి రూ.4,068 కోట్ల ఆదాయం సమకూరింది. తెలంగాణ రాష్ట్రంలో పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకం పన్ను 35.2 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు, అమ్మకాలు పెరిగే కొద్దీ రాష్ట్రానికి వచ్చే రాబడి పెరుగుతోంది.

గత ఏడాది కంటే 90 శాతం పెరుగుదల

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో వాణిజ్య పన్నులశాఖ రాబడి రికార్డు స్థాయికి చేరింది. గత ఏడాది రాబడుల కంటే  ఏకంగా 90 శాతం పైగా పెరగడం గమనార్హం. 2020-21లో జులై వరకు రూ.10,063 కోట్లు రాగా 2021-22లో రూ.19,527 కోట్లు వచ్చింది. ఒక్క జులై నెలలోనే రూ.6,710 కోట్లు ఆదాయం సమకూరడం గమనార్హం. గత ఏడాది కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాబడులు గణనీయంగా తగ్గాయి. జూన్‌ నుంచి క్రమంగా పుంజుకున్నాయి. ఈ ఏడాది మే నెల రాబడులపై మాత్రం కరోనా ప్రభావం పడగా మిగిలి నెలల్లో ఆదాయం పెరిగింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని