కొత్త పరిశ్రమల్లో స్థానికులకు భారీగా ఉపాధి

ప్రధానాంశాలు

కొత్త పరిశ్రమల్లో స్థానికులకు భారీగా ఉపాధి

 కాలుష్య పరిశ్రమలను సత్వరమే తరలించాలి

సమీక్షలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో ఏర్పాటవుతున్న కొత్త పరిశ్రమల్లో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన శిక్షణపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ఆ శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. నూతన పారిశ్రామిక పార్కుల్లో ఏమాత్రం కాలుష్య సమస్యలు లేకుండా చూడాలన్నారు. కాలుష్య నియంత్రణమండలితో ఇప్పటినుంచే కలిసి పనిచేయాలన్నారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను సత్వరమే తరలించాలని, ఆయా విభాగాల సంచాలకులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేయాలన్నారు. గురువారం ఆయన పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు.  ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, కమిషనర్‌ మాణిక్‌రాజ్‌, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌, ఎండీలు బాలమల్లు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ విభాగాల వారీగా  రాష్ట్రానికి రానున్న పెట్టుబడి ప్రతిపాదనలు.. వాటి పురోగతిపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు.

సిమెంటు పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి

సిమెంటు పరిశ్రమల్లో యాజమాన్యాలు స్థానికులకు 70 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. గురువారం టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో ఆయన హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని సిమెంటు కంపెనీల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. సిమెంట్‌ పరిశ్రమల అవసరాల కోసం స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని  ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. సైదిరెడ్డి మాట్లాడుతూ త్వరలోనే అన్ని పరిశ్రమల్లో అప్రెంటిస్‌షిప్‌ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని కోరారు.

ఆదిలాబాద్‌ సీసీఐ ప్లాంటును పునరుద్ధరించాలి

ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ప్లాంటును పునరుద్ధరించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్లాంటు పునరుద్ధరణకు  అనేక సానుకూల అవకాశాలు ఉన్నందున ఆ దిశగా తగిన చర్యలను వెంటనే చేపట్టాలని విన్నవించారు. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండేకు ఆయన గురువారం లేఖ రాశారు.


విద్యార్థినికి ఆర్థిక సాయం

నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయ ప్రవేశపరీక్షల్లో ర్యాంకుసాధించిన హరిప్రియ అనే విద్యార్థినిని మంత్రి కేటీఆర్‌ ఆదుకున్నారు. తన తండ్రి దినకూలీ అని, న్యాయ కళాశాలలో చేరడానికి డబ్బులు లేవని, తనకు ఆర్థికసాయం కావాలని ట్విటర్‌ ద్వారా ఆమె అభ్యర్థించగా కేటీఆర్‌ స్పందించారు. ఆమె విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు హరిప్రియ,  ఆమె కుటుంబసభ్యులను పిలిపించి గురువారం ఆర్థిక సాయం అందించారు.  మంత్రి సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనంటూ హరిప్రియ కృతజ్ఞతలు తెలిపారు. ఆమెకు సాయం చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని