తొందరపాటు తగదు

ప్రధానాంశాలు

తొందరపాటు తగదు

కొన్ని పత్రికల వార్తలపై జస్టిస్‌ రమణ ఆగ్రహం

న్యాయమూర్తుల నియామక ప్రక్రియ పవిత్రమైనదని వ్యాఖ్య

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తుల నియామకం పూర్తికాకుండానే కొన్ని వార్తాపత్రికలు తొందరపాటు ప్రదర్శిస్తూ కథనాలు రాయడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియకు పవిత్రత, గౌరవం ఉంటుందని, అలాంటి విషయాల్లో తొందరపాటుతో వార్తలు రాయడం బాగాలేదని వ్యాఖ్యానించారు. బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌ సిన్హా పదవీ విరమణ సందర్భంగా జరిగిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడారు.  ‘‘న్యాయమూర్తుల నియామకంపై మీడియాలో వచ్చిన కొన్ని ఊహాగానాలు, కథనాలపై నా ఆందోళన వ్యక్తంచేస్తున్నా. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది చాలా పవిత్రమైంది. దానికి నిర్దిష్టమైన గౌరవం ఉంది. అందువల్ల నా మీడియా మిత్రులు దాన్ని అర్థంచేసుకొని, ఈ ప్రక్రియకు ఉన్న పవిత్రతను గుర్తించాలి. వ్యవస్థగా మేం మీడియా స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. కానీ ఈరోజు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన తీర్మానాన్ని అధికారికంగా ఖరారు చేయకముందే మీడియాలోని కొన్ని వర్గాల్లో వార్తలు రావడం ప్రతికూలాంశం. ఇలాంటి బాధ్యతారహితమైన, ఊహాగానాల కారణంగా ప్రతిభావంతుల పురోగతి దెబ్బతింటుంది. ఇది చాలా దురదృష్టకరం. ఇది నన్ను తీవ్రంగా బాధించింది. ఇదే సమయంలో ఇలాంటి విషయాల్లో ఊహాగానాలకు తావివ్వకుండా సంయమనం పాటిస్తూ చాలా మంది సీనియర్‌ పాత్రికేయులు, మీడియా సంస్థలు  పరిపక్వతను ప్రదర్శించి, బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. అలాంటి వృత్తి నిబద్ధత ఉన్న పాత్రికేయులు, నైతిక విలువలను పాటించే మీడియా సంస్థలే సుప్రీంకోర్టుకు, మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి ప్రధాన బలం. అందువల్ల భాగస్వాములందరూ ఈ సంస్థ గౌరవ మర్యాదలు, నిబద్ధతను కాపాడుతారని నమ్ముతున్నా’’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. 

బహుముఖ ప్రజ్ఞాశాలి జస్టిస్‌ నవీన్‌ సిన్హా

ఉద్యోగ జీవితం చివరి రోజూ తనతో పాటు ధర్మాసనంలో కూర్చొని విధినిర్వహణలో పాలుపంచుకున్న జస్టిస్‌ నవీన్‌సిన్హా సేవలను జస్టిస్‌ రమణ శ్లాఘించారు. ‘‘1956 ఆగస్టు 19న అత్యంత గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించిన నవీన్‌సిన్హా న్యాయమూర్తిగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించారు. ఆయన తాత బిహార్‌ అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. మరో తాత పద్మభూషణ్‌ గౌరవం అందుకున్నారు. ఆయన తండ్రి కేంద్ర హోం శాఖలో అదనపు కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. తల్లి ఇండియన్‌ రెడ్‌క్రాస్‌తో కలిసి సామాజిక సేవలో పాలుపంచుకున్నారు. 1979లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పొందిన సిన్హా 23 ఏళ్లపాటు పట్నా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 2004లో అదే హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులైన ఆయన కాలక్రమంలో ఛత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌ హైకోర్టుల్లోనూ సేవలందించారు. ఆయన పనిచేస్తున్న కాలంలో మూడు హైకోర్టుల్లోని రికార్డులను కంప్యూటీకరించగలిగారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ నవీన్‌ సిన్హా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో విభిన్న అంశాలపై 114 తీర్పులు రాశారు. మొత్తం 13,671 కేసులు పరిష్కరించారు. ఆయనలోని అణకువ, సరళత నాకు నచ్చిన అంశాలు. ఎప్పుడూ పూర్తిగా సమాయత్తమై కోర్టుకు వస్తారు. ప్రతి కేసు గురించీ క్షుణ్ణంగా తెలిసినప్పటికీ సీనియర్లు, జూనియర్లు చేసే వాదనలను ఓపిగ్గా వింటారు. ఆయన ముందు వాదనలు వినిపించడం యువ న్యాయవాదులకు గొప్ప అనుభవం. తక్కువ మాట్లాడి లోతుగా ఆలోచించేవ్యక్తి. ఆయన పదవీ విరమణతో ముఖ్యమైన సహచరుడిని, విలువైన గొంతును కోల్పోతున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో ధర్మాసనంపై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ కూడా ఉన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని