ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ ప్రైవేటుకు..

ప్రధానాంశాలు

ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ ప్రైవేటుకు..

నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్ల సమీకరణ
భారీ నగదీకరణ ప్రణాళికను ప్రకటించిన నిర్మలాసీతారామన్‌
20 రకాల మౌలిక ఆస్తుల మానిటైజేషన్‌
యజమాని ప్రభుత్వమేనని స్పష్టీకరణ


నాలుగేళ్లలో సుమారు రూ.6 లక్షల కోట్లు సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా... 2021-22లో రూ.88 వేల కోట్లు, 2022-23లో రూ.1.62 లక్షల కోట్లు, 2023-24లో రూ.1.79 లక్షల కోట్లు, 2024-25లో రూ.1.67 లక్షల కోట్లు రాబడతారు


ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల నిర్వహణ ఇక ప్రైవేటుపరం కానుంది. ఈ ఆస్తుల నగదీకరణ (మానిటైజేషన్‌) ద్వారా... నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్లు సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ‘నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌’ను తీసుకొచ్చినట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరే నిధులను మళ్లీ మౌలిక వసతుల కల్పనకే వెచ్చిస్తామన్నారు. మానిటైజేషన్‌ అంటే ఆస్తుల విక్రయం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఆస్తులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకే ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామని, గడువు తీరిన తర్వాత వాటిని ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుందన్నారు. నీతి ఆయోగ్‌ రూపొందించిన ఈ కార్యక్రమ షెడ్యూలును మంత్రి సోమవారమిక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

‘‘2019 డిసెంబరులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ ప్రారంభించాం. ఈ ఏడాది నేషనల్‌ అసెట్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను ఆరంభిస్తున్నాం. ఈ రెండూ ఒకేసారి ముగుస్తాయి. మౌలిక వసతుల కల్పనతో ఆర్థికవృద్ధి సాధ్యమని భావించాం. ఇందుకు ప్రభుత్వపరంగా నిధులు ఖర్చుచేయాలని నిర్ణయించాం. అసెట్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ ద్వారా పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాం. వృథాగా పడివున్న, పూర్తిస్థాయిలో వినియోగించని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికి అప్పగించి, వాటిని మరింత సమర్థంగా ఉపయోగించుకోవడమే ఈ కార్యక్రమ లక్ష్యం. తద్వారా వచ్చే నిధులను మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చిస్తాం. ఇందులో భూములను విక్రయించడం లేదు. వాటిపై యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా ముప్పులేని, బ్రౌన్‌ఫీల్డ్‌ ఆస్తులను ఉత్తమంగా ఉపయోగించుకుంటాం. గడువు ముగిసిన తర్వాత ఆయా సంస్థలు వాటిని మళ్లీ ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆస్తులను విక్రయిస్తుందన్న అనుమానం, ఆందోళన అక్కర్లేదు. ఒప్పంద భాగస్వాములు తప్పనిసరిగా ప్రమాణాలు పాటించాలి. ప్రస్తుతం పరిస్థితులు మారాయి కాబట్టి, వినూత్న పద్ధతుల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకొస్తున్నాం. ఏడేళ్లుగా ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉన్నాయి కాబట్టి... ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నాం. నియంత్రణ సంస్థల పనితీరును ప్రధానమంత్రే నేరుగా సమీక్షిస్తున్నారు. దీంతో వాటి నుంచి నిరంతరం చేయూత అందుతుందని భావిస్తున్నాం. బడ్జెట్‌లో చెప్పినట్టే ఈ పథకాన్ని అమల్లోకి తెస్తున్నాం.

రాష్ట్రాలకు మరో రూ.10 వేల కోట్ల రుణం
మహమ్మారి సమయంలో రాష్ట్రాలకు వడ్డీ లేకుండా 50 ఏళ్ల కాలానికి రూ.12 వేల కోట్ల రుణం ఇచ్చాం. ఈ ఏడాది మరో రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యాం. వీటి ద్వారా రాష్ట్రాలు తమకు ఇష్టమైన మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టవచ్చు. రాష్ట్రాలకు సాయం చేయడానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాం. అయితే మూడు షరతులకు లోబడి ఈ నిధులను అందిస్తాం.

1) రాష్ట్రాలు తమ ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలి. యాజమాన్య హక్కులనూ బదిలీ చేయాలి. తద్వారా ఎంత మొత్తం సమకూరితే, అందుకు సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా ఇస్తుంది.

2) ప్రైవేటీకరణ కాకుండా... రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలను మార్కెట్‌లో లిస్ట్‌చేస్తే చాలు. ఆ లిస్టింగ్‌ ద్వారా వచ్చే డబ్బులో 50% మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తుంది.

3) రాష్ట్రాలు తమ ప్రభుత్వ ఆస్తులను మానిటైజ్‌ చేస్తే, తద్వారా వచ్చే మొత్తంలో 33 శాతానికి సమానమైన మొత్తాన్ని కేంద్రం ఇస్తుంది.’’ అని నిర్మలా సీతారామన్‌ వివరించారు.

ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌, సీఈవో అమితాబ్‌ కాంత్‌, రైల్వేబోర్డు ఛైర్మన్‌ సునీత్‌శర్మ... కేంద్ర పట్టణాభివృద్ధి, పౌర విమానయానశాఖల కార్యదర్శులు దుర్గాశంకర్‌ మిశ్ర, ప్రదీప్‌సింగ్‌ ఖరోలా తదితరులు పాల్గొన్నారు.

ఏమేం ఆస్తులు వస్తాయి? ఏ విధానాల్లో ఆస్తులను అప్పగిస్తారు?
‘నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌’ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యమైన, మౌలిక వసతులన్నీ వస్తాయి. 12 శాఖలకు చెందిన 20కి పైగా ఆస్తులు ఇందులో ఉంటాయి. వీటిలో ప్రధానంగా రహదారులు, రైల్వేలు, విద్యుత్తు వ్యవస్థ ఉన్నాయి. 2022 నుంచి 2025 వరకు ఈ కార్యక్రమం అమలవుతుంది. ఆపరేట్‌ మెయింటెన్‌, ట్రాన్స్‌ఫర్‌, టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌, ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌, డెవలప్‌మెంట్‌, రిహాబిలిటేట్‌ ఆపరేట్‌ మెయింటెయిన్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానాల్లో ఈ ఆస్తులను అప్పగిస్తారు.

* రైల్వేలో 400 స్టేషన్లు, 90 ప్రయాణికుల రైళ్లు, 1,400 కిలోమీటర్ల ట్రాక్‌, 265 గూడ్స్‌షెడ్లు, 741 కిలోమీటర్ల కొంకణ్‌ రైల్వే, 4 హిల్‌ రైల్వే, 674 కిలోమీటర్ల డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌, 15 రైల్వే స్టేడియంలను ప్రైవేటు వారికి అప్పగిస్తారు.

* ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తారు.

* దిల్లీ, హైదరాబాద్‌, బెంగుళూరు తదితర విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాలను పూర్తిగా విక్రయిస్తారు.

* 9 మేజర్‌ పోర్టుల్లో ఉన్న 31 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అప్పగిస్తారు.

* బీబీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, డిపార్ట్‌మెంట్‌ టెలీ కమ్యూనికేషన్స్‌లో ఉన్న ఆస్తులన్నింటినీ ప్రైవేటు వారికి ఇచ్చేస్తారు.

* జాతీయ స్టేడియంలు, ప్రాంతీయ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలు, అతిథిగృహాలు, హోటళ్లు వంటి వాటిని ప్రైవేటుకు అప్పగిస్తారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని