పాఠశాలలపై నిర్బంధం వద్దు

ప్రధానాంశాలు

పాఠశాలలపై నిర్బంధం వద్దు

గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాలలు తెరవొద్దు

ప్రత్యక్ష తరగతులు నిర్వహించే బడుల్లో కొవిడ్‌ నిబంధనలపై వారంలోగా మార్గదర్శకాలు జారీచేయాలి: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను మంగళవారం పాక్షికంగా సవరిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ఎవరిపైనా..ఎలాంటి నిర్బంధాలూ వద్దని స్పష్టంచేసింది. బడులను ప్రత్యక్షంగా నిర్వహించాలా? ఆన్‌లైన్‌లోనా? అనే విషయంలో యాజమాన్యాలదే తుది నిర్ణయమని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వులను అమలుచేయని ప్రైవేటు పాఠశాలలపై ఎలాంటి చర్యలూ తీసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. పిల్లలు తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఒత్తిడి చేయడం, హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకోరాదంది. ‘పాఠశాలల్లో ఏదైనా జరిగితే యాజమాన్యాలకు సంబంధంలేదంటూ’ తల్లిదండ్రుల నుంచి తీసుకునే హామీ పత్రానికి ఎలాంటి చట్టబద్ధత లేదని పేర్కొంది. వసతి గృహాలున్న గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాలలను మాత్రం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ప్రారంభించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వారంలోగా ప్రామాణిక నిర్వహణ మార్గదర్శకాల (ఎస్‌వోపీ)ను విడుదలచేయాలని, వాటిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతోపాటు.. పాఠశాలల్లో కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. సాంఘిక సంక్షేమ శాఖల పాఠశాలల్లోని పిల్లల భద్రతకు ఏం చర్యలు తీసుకున్నారు? ఒకవేళ పిల్లలు పెద్ద సంఖ్యలో కొవిడ్‌ బారినపడితే చికిత్స అందించడానికి ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని పడకలు సిద్ధంగా ఉన్నాయి? తదితర అన్ని అంశాలపై ఆయా శాఖలు సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని పూర్వ ప్రాథమిక, ప్రాథమిక పాఠశాలలతోపాటు ప్రైవేటు విద్యాసంస్థలన్నింటినీ సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలంటూ విద్యాశాఖ కార్యదర్శి ఈ నెల 24న జారీ చేసిన మార్గదర్శకాలను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపించారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోందన్నారు. ప్రభుత్వ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ..బడుల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుందన్నారు. వైద్యఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌ శాఖలతో చర్చించే నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ఈ దశలో ధర్మాసనం స్పందిస్తూ ‘‘పాఠశాలల్లో తనిఖీలు చేపట్టడానికి సరిపడా సిబ్బంది ఉన్నారా? హైదరాబాద్‌లో ఎంతమంది డీఈవోలు ఉన్నారు? పాఠశాలల్లో మౌలిక వసతుల మాటేమిటి? 200 మంది పిల్లలున్న తరగతి గదిలో ఎవరికైనా వైరస్‌ సోకితే, ఎన్ని కుటుంబాలు వైరస్‌ బారినపడతాయో తెలియని పరిస్థితి. అలాంటిదేదైనా జరిగితే ఎదుర్కోవడానికి అవసరమైన వైద్యసదుపాయాల కల్పన మాటేమిటి?’ అని నిలదీసింది. ఇలాంటి వివరాలు లేకుండా ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుబట్టింది. రెండు విడతల్లో కొవిడ్‌ వల్ల లెక్కలేనన్ని మరణాలు సంభవించాయని, వేల మంది ఆసుపత్రుల పాలయ్యారని, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో మూడో విడత వ్యాప్తికి అవకాశం ఉందనే అంచనాలున్నాయని పేర్కొంది. చిన్న పిల్లల్లో వైరస్‌ లక్షణాలు కనిపించకపోయినా, వ్యాప్తికి అవకాశం ఉందంటూ పలు అధ్యయనాలు చెబుతున్నాయని గుర్తుచేసింది.

వ్యాక్సినేషన్‌ పూర్తయిందా?

18 ఏళ్లు దాటినవారికి కూడా పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ జరగకపోవడాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘పిల్లలు బోధన, బోధనేతర సిబ్బందితో సన్నిహితంగా మెలగుతుంటారు. వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయిందని ప్రభుత్వం చెప్పలేకపోతోంది. వారి ద్వారా విద్యార్థికి వైరస్‌ సోకితే, తద్వారా కుటుంబ సభ్యులకు సోకవచ్చు. ఈ అంశాలన్నింటినీ ఆలోచించే ప్రభుత్వం మెమో జారీ చేసిందా? దానికి ముందు నిపుణుల కమిటీ సలహాలు, సిఫారసులను విద్యాశాఖ తీసుకుందా? లేదా? అనే అంశాన్నీ పరిశీలించాల్సి ఉంది. అదే సమయంలో కొన్ని వర్గాల తల్లిదండ్రులతోపాటు.. పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యక్ష బోధనకు మొగ్గు చూపుతున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులకు అవసరమైన ఫోన్‌, ఇంటర్నెట్‌ సౌకర్యాలు లేకపోవడం, పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందకపోవడం, ఇతర ఆర్థిక కారణాల నేపథ్యంలో కొన్ని వర్గాలు ప్రత్యక్ష బోధనపై ఆసక్తి చూపుతున్నాయి’ అని ధర్మాసనం పేర్కొంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామంది.


ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులివే

* తల్లిదండ్రులకు ఇష్టంలేని పక్షంలో విద్యార్థిని పాఠశాలకు పంపాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకురాకూడదు.

* ప్రభుత్వం జారీచేసిన మెమోను అమలుచేయని ఏ ప్రైవేటు పాఠశాలపైనా చర్యలు తీసుకోరాదు.

* ప్రైవేటు/ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థి ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని పక్షంలో ఎలాంటి చర్యలు చేపట్టరాదు.

* ప్రత్యక్ష బోధన/ఆన్‌లైన్‌ బోధన లేదంటే రెండు రకాలా అన్నది పాఠశాలల నిర్ణయానికే వదిలేయాలి.

* ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తాయి.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని