బడి గంటకు వేళాయె

ప్రధానాంశాలు

బడి గంటకు వేళాయె

నేటి నుంచి పాఠశాలలు

బోధన విధానం యాజమాన్యాల ఇష్టమే

విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదు

తల్లిదండ్రుల సమ్మతి పత్రాలు అడగరాదు

హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం..మార్గదర్శకాల జారీ

ఈనాడు - హైదరాబాద్‌

ప్రభుత్వం ముందుగా నిర్ణయించినట్లు బుధవారం నుంచి రాష్ట్రంలో పాఠశాలలు తెరచుకోనున్నాయి. ప్రత్యక్ష తరగతులు మాత్రమే కొనసాగుతాయని చెబుతూ వచ్చిన ప్రభుత్వం హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ మాటను విరమించుకుంది. పాఠాలు ఆన్‌లైన్‌లో బోధించాలా?  ఆఫ్‌లైన్‌లోనా? అనేది పాఠశాల యాజమాన్యాల ఇష్టమేనని స్పష్టంచేసింది. ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలను మాత్రం తెరవడానికి వీల్లేదని ఆదేశించింది. ప్రత్యక్ష బోధన చేపట్టే పాఠశాలల్లో అనుసరించాల్సిన కొవిడ్‌ నిబంధనలపై వారంలోపు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌(ఎస్‌వోపీ) ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో అప్పటివరకు బడులను తెరుస్తారా? లేదా? అనే అయోమయం నెలకొంది. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సాయంత్రం విద్యాశాఖ అధికారులతో చర్చించారు.  బడులు తెరవాలనే నిర్ణయానికే ఆమోదం తెలిపారు. ఆ మేరకు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పలు అంశాలపై స్పష్టత ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా సవరణ ఉత్తర్వులను జారీ చేశారు.

వర్సిటీలు, కళాశాలలు సైతం..

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కూడా బుధవారం నుంచి తెరచుకోవచ్చు. ప్రత్యక్ష తరగతులను ప్రారంభించవచ్చు. హాస్టళ్లనూ తెరవొచ్చు. హైకోర్టు తీర్పు ఉన్నత విద్యకు కూడా వర్తిస్తుందా? అన్న ప్రశ్న తలెత్తిన నేపథ్యంలో కళాశాలలకు, వర్సిటీలకు అది వర్తించదని ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి మంగళవారం సాయంత్రం ఆయా వర్సిటీల ఉపకులపతులతో సమావేశమై ఇదే విషయాన్ని చెప్పారు. విద్యా సంస్థల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. తరగతి గది/వసతి గృహాల్లో వ్యక్తిగత దూరం పాటించే పరిస్థితులు లేకపోతే ఆన్‌లైన్‌ విధానంలో కూడా పాఠాలు బోధించవచ్చని తెలిపారు. ఈ క్రమంలో వర్సిటీలు హాస్టళ్లను తెరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి.


బుధవారం నుంచి పునఃప్రారంభమవుతున్న పాఠశాలలను అందంగా తీర్చిదిద్దాలని మహబూబాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు ఎంపీజీపీఎస్‌ పాఠశాలను ఇలా ముస్తాబు చేశారు. గేటు ముందు షామియానాలు వేసి.. పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించి పిల్లలకు స్వాగతం పలుకుతున్నారు.

- న్యూస్‌టుడే, మహబూబాబాద్‌ రూరల్‌


తాజా నిర్ణయాలివీ

* ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టళ్లతో కూడిన సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలలు తప్ప మిగతావి తెరచుకుంటాయి.

* ప్రత్యక్ష తరగతులకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలంటూ పాఠశాలల యాజమాన్యాలు బలవంతం చేయరాదు.

* ఆఫ్‌లైన్‌ బోధనా? ఆన్‌లైనా? లేదా రెండు విధానాలనూ అనుసరిస్తారా? అనేది ఆయా పాఠశాలల యాజమాన్యాలే నిర్ణయించుకోవచ్చు.

* తల్లిదండ్రుల నుంచి హామీ పత్రాలు తీసుకున్నా న్యాయపరంగా చెల్లవు. పిల్లలు కరోనా బారినపడితే విద్యాసంస్థల యాజమాన్యాలదే బాధ్యత.

* ప్రత్యక్ష తరగతులు నిర్వహించే పాఠశాలలు తగిన కొవిడ్‌ నియమ నిబంధనలు పాటించేలా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌(ఎస్‌వోపీ)ని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారంలోపు జారీ చేస్తారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని