దిల్లీలో.. గల్లీల్లో.. తెరాస సందడి

ప్రధానాంశాలు

దిల్లీలో.. గల్లీల్లో.. తెరాస సందడి

దేశ రాజధానిలో పార్టీ కార్యాలయానికి కేసీఆర్‌ భూమి పూజ
రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ  
పార్టీ సంస్థాగత ఎన్నికలూ ప్రారంభం
ఈనాడు - దిల్లీ

తెరాస చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దీనికి శ్రీకారం చుట్టారు. దేశ రాజధాని దిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ నిర్మాణానికి సీఎం గురువారం భూమి పూజ చేశారు.  వసంతవిహార్‌లో పార్టీ కోసం కేటాయించిన స్థలంలో తెరాస ప్రజాప్రతినిధుల సమక్షంలో మధ్యాహ్నం 1.48 గంటలకు ముందుగా నిర్ణయించిన ముహూర్తానుసారం వేదమంత్రోచ్చారణల నడుమ శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఉదయం 10 గంటల నుంచే వేదపండితులు హోమాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 1.14 గంటలకు ముఖ్యమంత్రి కార్యాలయ నిర్మాణ స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఇద్దరూ హోమంలో పాల్గొన్నారు. 2.20 గంటలకు సీఎం శంకుస్థాపన ప్రదేశం నుంచి అధికారిక నివాసానికి తిరిగి వెళ్లారు. మరోపక్క తెరాస ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ ఘనంగా జరిగింది. అన్ని జిల్లాలు, నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో వాడవాడలా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. పార్టీ సంస్థాగత ఎన్నికలు సైతం మొదలయ్యాయి. తొలిరోజు 1,212 గ్రామాలు, వార్డు కమిటీలు ఏర్పాటయ్యాయి.

గుర్తింపు కార్డులున్న వారికే అనుమతి

దిల్లీలో శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, ఛైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు తెరాస నాయకులు హాజరయ్యారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రెయిన్‌ప్రూఫ్‌ టెంట్‌ ఏర్పాటు చేశారు.  పెద్ద సంఖ్యలో ప్రముఖులు రావడంతో స్థలం సరిపోలేదు. గుర్తింపు కార్డులున్న వారిని మాత్రమే పోలీసులు అనుమతించారు. దీంతో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో శాసనసభ మాజీ సభాపతి మధుసూదనాచారి కిందపడిపోయారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఆయనను కార్యక్రమ స్థలానికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, జగదీశ్వర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, లోక్‌సభ పక్ష ఉప నేత కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఇతర ఎంపీలు పాల్గొన్నారు.

ప్రసంగించని ముఖ్యమంత్రి

శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగిస్తారని అంతా భావించినా ఆయన మాట్లాడలేదు. ముఖ్యమంత్రి శంకుస్థాపన స్థలానికి వచ్చిన సమయంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. స్థలం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు పలికారు. రాత్రి ఎంపీ బీబీ పాటిల్‌ ఇచ్చిన విందులో సీఎం కేసీఆర్‌ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని