బండి సంజయ్‌వి ఒట్టి మాటలే

ప్రధానాంశాలు

బండి సంజయ్‌వి ఒట్టి మాటలే

రాష్ట్ర ప్రజలు చెల్లించింది రూ.2.72 లక్షల కోట్ల పన్నులు
కేంద్రం ఇచ్చింది రూ.1.42 లక్షల కోట్లే
తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా.. నువ్వు సిద్ధమా?
గద్వాల పర్యటనలో మంత్రి కేటీఆర్‌ సవాల్‌

మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌: దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు ఇతర వెనుకబడిన రాష్ట్రాలకు అందిస్తున్న నిధుల్లో తెలంగాణ ప్రజల స్వేదం, రక్తం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తూ ఇక్కడ అమలవుతున్న పథకాలకు మొత్తం పైసలు కేంద్రం ఇస్తోందని, రాష్ట్రం మాత్రం సోకులు పడుతోందంటూ సొల్లు కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కేంద్రానికి పన్నుల రూపంలో ఈ ఆరున్నరేళ్లలో రూ.2.72 లక్షల కోట్లు కడితే, కేంద్రం మాత్రం ఆర్థిక సంఘం రూపంలో, జనాభా దామాషా ప్రాతిపదికన రాష్ట్రానికి రూ.1.42 లక్షల కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఇచ్చిందన్నారు. ‘నేను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. నువ్వు చెప్పింది తప్పయితే నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా? గద్వాల వేదికగా సవాలు విసురుతున్నా.. దమ్ముంటే రుజువు చేయాలని’ సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ సవాలు విసిరారు. రాష్ట్రంలోని నిధులు మొత్తం కేంద్రానివైతే కర్ణాటకలో రైతుబంధు, రైతు బీమా, సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రూ.2 వేల ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.

1.32 లక్షల ఉద్యోగాలిచ్చిన రాష్ట్రప్రభుత్వం

జోగులాంబ గద్వాల జిల్లా.. అలంపూర్‌లో రూ.21 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన, గద్వాలలో రూ.104 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తదితరులతో కలిసి మంగళవారం కేటీఆర్‌ శ్రీకారం చుట్టారు. ‘గద్వాల ప్రగతి ప్రజా ఆశీర్వాద’ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరున్నరేళ్లలో 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 157 వైద్య కళాశాలలు, 16 ఐఐఎంలు, 40 నవోదయ పాఠశాలలు మంజూరు చేస్తే, రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరవాత 13 వైద్య కళాశాలలను స్థాపించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. సంచులతో దొరికిపోయిన కొత్త బిచ్చగాడు కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారని, కేసీఆర్‌ను పట్టుకుని ఇలా చేయలేదు.. అలా చేయలేదని ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. తమ నాయకుడిని ప్రజలు దీవిస్తుంటే భాజపా, కాంగ్రెస్‌ నేతల కళ్లు మండుతున్నాయన్నారు. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని విమర్శించారు. ఆయన తన ప్రాణాన్నే పణంగా పట్టి తెలంగాణ సాధించారని, రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన వ్యక్తే సీఎం అయ్యారని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని