మునిగిన మరో పంపుహౌస్‌

ప్రధానాంశాలు

మునిగిన మరో పంపుహౌస్‌

సారంగపూర్‌ బాటలోనే మల్కపేట
రెండూ కాళేశ్వరం ఎత్తిపోతల్లోనివే
వారం రోజులుగా వరద నీటిలోనే
తోడేందుకు చెన్నై నుంచి ఎనిమిది 80 హెచ్‌పీ మోటార్లుk

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మరో పంప్‌హౌస్‌ వరద నీటిలో చిక్కుకుంది. కొద్దిరోజుల క్రితమే నిజామాబాద్‌ శివారులోని సారంగపూర్‌ పంప్‌హౌస్‌ నీట మునిగింది. ఇప్పుడు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట భూగర్భ పంపుహౌస్‌ వరదలో చిక్కుకుంది. వారం రోజుల నుంచి నీటిలో మునిగిపోయి ఉంది. ఇప్పటికే ఒకసారి ఇది మునిగినా తగిన ఏర్పాట్లు చేయకపోవడమే తాజా పరిస్థితికి కారణమని తెలుస్తోంది. సొరంగ మార్గాల నుంచి వరద లోనికి వెళ్లకుండా అడ్డుకట్టలు ఏర్పాటు చేయలేదు. మధ్య మానేరు నుంచి ఎగువ మానేరుకు నీటిని తరలించడంలో భాగంగా ప్యాకేజీ 9లో ఈ పంపుహౌస్‌, జలాశయ నిర్మాణం చేపట్టారు. ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో కురిసిన వర్షాలకు మానేరు పరీవాహకంలో చెరువులు నిండాయి. మత్తళ్ల నుంచి వచ్చిన వరద సొరంగ మార్గాల ద్వారా లోనికి వెళ్లి ముంచెత్తింది. భారీగా నిల్వ ఉన్న నీటిని తోడేస్తేగానీ నష్టం అంచనా వేయడం సాధ్యం కాదని ఇంజినీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. అధికారులు చెన్నై నుంచి ఎనిమిది 80 హార్స్‌ పవర్‌(హెచ్‌పీ) సామర్థ్యం ఉన్న మోటార్లను తెప్పించారు.

2019 సెప్టెంబరులోనూ ఇదే తీరులో మునక

మల్కపేట పంపుహౌస్‌కు మధ్య మానేరు(రాజరాజేశ్వర) జలాశయం వెనుక జలాలు వచ్చే విధంగా సొరంగం తవ్వారు. లైనింగ్‌ పనులు నడుస్తూండటంతో సొరంగంలోకి వెళ్లేందుకు అక్కడక్కడ దారులు ఏర్పాటు చేశారు. ఇటీవల మానేరు పరీవాహక ప్రాంతంలో ఒక్కసారిగా 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో సిరిసిల్ల, కోనరావుపేట మండలాల్లోని గొలుసు కట్టు చెరువులు పూర్తిగా నిండాయి. పర్రెలకుంట కట్ట తెగిపోయింది. సిరిసిల్ల ఎగువన ఉన్న జంగమయ్య కుంట, పెద్దచెరువు, శుద్ధికుంట, కొత్త చెరువులు నిండటంతోపాటు పట్టణాన్ని చుట్టు ముట్టిన నీరు సొరంగ మార్గాల ద్వారా లోనికి ప్రవేశించింది. వాస్తవానికి ఈ నీరంతా మానేరులోకి వెళ్లాలి. రాజరాజేశ్వర జలాశయం వెనుక జలాలు సిరిసిల్లలోకి రాకుండా కరకట్ట నిర్మించారు. వరదకు ఈ కట్ట అడ్డుగా రావడంతో సొరంగంవైపు మళ్లింది. దీంతో సొరంగంతోపాటు భూగర్భంలో ఉన్న పంపుహౌస్‌ మునిగిపోయింది. 2019 సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు కూడా ఇదే తీరులో మునకేసింది. సొరంగం పనులు, సిమెంటు లైనింగ్‌ పనులు పూర్తికాకపోవడంతో సీపేజీ నీళ్లు కూడా వచ్చి చేరాయి. అప్పుడు కూడా భారీ మోటార్లు ఏర్పాటు చేసి నెల రోజులపాటు నీటిని తోడారు.

నీళ్లలోనే నిర్మాణ సామగ్రి  

రాజరాజేశ్వర జలాశయం నుంచి 120 రోజుల్లో 11.63 టీఎంసీల నీటిని ఎగువ మానేరుకు తరలించడంలో ఈ పంపుహౌస్‌ కీలకమైనది. దీనిలో రెండు 30 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. డిసెంబరు నాటికి ఒక పంపును ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా నడిపించాలని ఇంజినీర్లు నిర్ణయించారు. దానికి సంబంధించిన పనులు సాగుతున్నాయి. రగుడు నుంచి మల్కపేట వరకు 12 కిలోమీటర్ల సొరంగ మార్గంలో 2.40 కిలోమీటర్ల పొడవున అసంపూర్తిగా ఉన్న లైనింగ్‌ పనులు కొనసాగుతున్నాయి.

పది రోజుల్లో తోడాలన్నది లక్ష్యం

మొత్తం 12 కిలోమీటర్ల పొడవున్న సొరంగ మార్గంలో నాలుగు ద్వారాలు ఉన్నాయి. సిరిసిల్ల శివారులో మూడు, చంద్రపేట, ధర్మారం సొరంగం మార్గాల వద్ద రెండు మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. పది రోజుల్లో వరద నీటిని తోడాలనేది లక్ష్యం. తోడే నీటిని రగుడు వద్ద నుంచి రాజరాజేశ్వర జలాశయంలోకి, మిగతా చోట్ల చెరువుల్లోకి ఎత్తిపోయనున్నారు.

పథకం సంక్షిప్త స్వరూపం

* 9వ ప్యాకేజీ అంచనా: రూ.1,383.32 కోట్లు
* సొరంగ మార్గం: 12 కిలోమీటర్లు
* జలాశయాలు : మల్కపేట (3 టీఎంసీలు), బట్టలచెరువు(2 టీఎంసీలు)
* ఆయకట్టు: 86 వేల ఎకరాలు

 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని