రేపు మంత్రిమండలి సమావేశం

ప్రధానాంశాలు

రేపు మంత్రిమండలి సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాల తేదీల ఖరారుతోపాటు దళితబంధు, వరికి ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. గత మార్చి 25న శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. మళ్లీ ఆరు నెలల్లోపు అంటే ఈ నెల 25వ తేదీలోగా ఉభయసభలు సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ లోగా సమావేశాలను ప్రారంభించేలా నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్‌లో భారీఎత్తున నిర్వహించే గణేశ నిమజ్జనోత్సవం ఈ నెల 19తో ముగియనుంది. ఆ తర్వాత ఒకటి లేదా రెండు రోజుల విరామం అనంతరం సమావేశాలను 21 నుంచి 23 తేదీల్లో ప్రారంభించాలనే అంశంపై ఇప్పటికే చర్చ నడుస్తోంది. సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల అంశాన్ని కూడా ఖరారు చేస్తారు. దళితబంధు పథకంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వాసాలమర్రిలో ప్రారంభించిన ఈ పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. ఆ తర్వాత మధిర, తుంగతుర్తి, అచ్చంపేట-కల్వకుర్తి, జుక్కల్‌ నియోజకవర్గాల్లోని చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్‌ మండలాల్లో ప్రయోగాత్మకం (పైలట్‌ ప్రాజెక్టు)గా అమలు చేసేందుకు నిర్ణయించింది. వీటన్నింటిలో పథకం అమలు, నిధుల మంజూరుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు (దొడ్డు) బియ్యం కొనేది లేదని తేల్చిచెప్పడంతో వరి సాగును తగ్గించాలని భావిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా లాభదాయకమైన పంటల సాగు వైపు రైతులను మళ్లించేందుకు వీలుగా కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏపీకి ఉద్యోగుల శాశ్వత బదిలీకి అనుమతించనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని