మార్చి తర్వాత రూ.లక్ష వరకు రుణమాఫీ

ప్రధానాంశాలు

మార్చి తర్వాత రూ.లక్ష వరకు రుణమాఫీ

మహిళల అభ్యున్నతికి కుటీర పరిశ్రమలు
ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడి

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే; జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: వచ్చే మార్చి తర్వాత రూ.యాభై వేల నుంచి రూ.లక్ష వరకూ రైతులకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శాసనసభ్యుడు వొడితల సతీశ్‌కుమార్‌తో కలసి బుధవారం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే రూ.50 వేల లోపు రుణమాఫీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. రాబోయే రెండు నెలల్లో వడ్డీతో సహాడబ్బులు బ్యాంకుల్లో జమ చేస్తామన్నారు. ప్రజలు సొంత జాగాలో ఇంటిని నిర్మించుకుంటే ఇచ్చే నిధుల కోసం మొత్తం రూ.10 వేల కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించామని చెప్పారు. అన్ని గ్రామాల్లో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం రూ.42 కోట్ల సంక్షేమ నిధిని సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేశారన్నారు. ప్రెస్‌ అకాడమీ ద్వారా జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.

నేను పోతా బిడ్డో సర్కారు దవాఖానాకు..

మహిళలు ఆర్థిక అభ్యున్నతిని సాధించేందుకు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంలో బుధవారం మహిళా సంఘాల సభ్యులకు రూ.2.13 కోట్ల స్త్రీనిధి, వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసరా పింఛన్లతో వృద్ధులు, వితంతువుల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. గతంలో సర్కారు దవాఖానాకు పోవాలంటే భయపడేవారని కాని నేడు ఆ పరిస్థితి మారిందన్నారు. ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’’ అనే పాటను నేడు ‘‘నేను పోతా బిడ్డో సర్కారు దవాఖానాకు’’ అనేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని