తెలంగాణలో డ్రోన్ల పరీక్ష కారిడార్‌

ప్రధానాంశాలు

తెలంగాణలో డ్రోన్ల పరీక్ష కారిడార్‌

వైమానిక, రక్షణ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: వైమానిక యంత్రాల తయారీ సమూహంగా ఎదిగిన తెలంగాణలో త్వరలో డ్రోన్ల పరీక్ష నడవా (డ్రోన్‌ టెస్టింగ్‌ కారిడార్‌) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. డ్రోన్ల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రంలో వైమానిక, రక్షణ విశ్వవిద్యాలయం లేదా ప్రతిభా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), ఇతర సంస్థలు వైమానిక, రక్షణ ఇంక్యుబేటర్ల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. బుధవారం టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ వైమానిక విడిభాగాల సంస్థ(టీఎల్‌ఎమ్‌ఏఎల్‌) తమ 150వ సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌ సైనిక విమాన ప్రధాన భాగం విడుదల సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో కార్యక్రమం నిర్వహించింది. దీనికి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌లో 30 శాతం భాగాలు హైదరాబాద్‌కు చెందిన సంస్థలే తయారు చేయడం తెలంగాణకు గర్వకారణం. వైమానిక రంగంలో అంకురాలను ప్రోత్సహిస్తున్నాం. దేశంలో తొలిసారిగా తెలంగాణ డ్రోన్ల విధానాన్ని రూపొందించింది. ఆకాశమార్గం గుండా ఔషధాలను మారుమూల ప్రాంతాలకు పంపిణీ చేసే ప్రాజెక్టును ప్రారంభించింది. హైదరాబాద్‌లో టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ భాగస్వామ్యం భారతదేశం- తెలంగాణ, అమెరికాల మధ్య బలమైన సహకారానికి నిదర్శనం. టాటా ద్వారా బోయింగ్‌, జీఈ ఏవియేషన్‌ వంటి ఇతర అమెరికా సంస్థల భాగస్వామ్యాలు ఏర్పడడం ఈ రంగంలో బలోపేతానికి ఊతమిస్తోంది. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, సికోర్కీలు హైదరాబాద్‌లో రూ.740 కోట్ల పెట్టుబడితో వేయి మందికి ఉపాధి కల్పించాయి. సీ-130జే విమానాల్లో 85 శాతానికిపైగా హైదరాబాద్‌లో తయారు కావడం రాష్ట్రానికి గర్వకారణం’’ అని కేటీఆర్‌ అన్నారు. సమావేశంలో హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మాన్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈవో సుకరణ్‌సింగ్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌ సీఈవో విల్‌ బ్లేయిర్‌, టీఎల్‌ఎంఏఎల్‌ ముఖ్య నిర్వహణ అధికారి కిరణ్‌ దంబాలా, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని