కెల్విన్‌ ఎవరో తెలియదు.. ఎఫ్‌ క్లబ్‌ పార్టీలకు వెళ్లలేదు

ప్రధానాంశాలు

కెల్విన్‌ ఎవరో తెలియదు.. ఎఫ్‌ క్లబ్‌ పార్టీలకు వెళ్లలేదు

నా సంపాదనంతా కుటుంబానికే సరిపోయేది
ఈడీ విచారణలో వెల్లడించిన నటి ముమైత్‌ఖాన్‌
7 గంటలపాటు విచారించిన అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: టాలీవుడ్‌ మత్తుమందుల కేసులో సినీనటి ముమైత్‌ఖాన్‌ విచారణ ముగిసింది. బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆమె సాయంత్రం 5.30 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. 2017 నాటి మత్తుమందుల కేసులో కెల్విన్‌ ద్వారా ఆమె పేరు బహిర్గతమైంది. అప్పట్లో ఆబ్కారీశాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఆమెను విచారించింది. ఆ కేసు ఆధారంగానే నిధుల మళ్లింపుపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ అధికారులు ఇప్పుడామెను విచారించారు. ప్రధానంగా టాలీవుడ్‌ మత్తుమందుల సూత్రధారి కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీయగా, కెల్విన్‌ ఎవరో తనకు తెలియదని ఆమె సమాధానమిచ్చినట్టు సమాచారం. ఈ దశలో ముమైత్‌ పేరును కెల్విన్‌ ప్రస్తావించినట్టు సిట్‌ నివేదికలో నమోదైన వివరాలను, తమ విచారణలోనూ కెల్విన్‌ అదే విషయాన్ని నిర్ధారించడాన్ని ఈడీ అధికారులు ఆమె దృష్టికి తీసుకెళ్లారని.. అతనితో తనకు ఎలాంటి పరిచయం లేదని ఆమె స్పష్టంచేసినట్లు తెలిసింది. సినీ పరిశ్రమలో మత్తుమందుల వినియోగానికి సంబంధించి, ఎఫ్‌-క్లబ్‌లో జరిగే పార్టీల గురించి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. వాటన్నింటికీ ‘‘తెలియదు, ఎఫ్‌-క్లబ్‌లో జరిగే పార్టీలకు నేను హాజరుకాలేదు’ అని ఆమె జవాబిచ్చినట్లు తెలుస్తోంది. ఆమె బ్యాంకు ఖాతాల ఆధారంగా జరిగిన లావాదేవీలను అంతకుముందే సేకరించిన ఈడీ అధికారులు వాటి గురించి కూడా ప్రశ్నించారు. అందులో అనుమానాస్పద లావాదేవీలు ఏవీ లేవని, తన సంపాదన అంతా కుటుంబ పోషణకే సరిపోయేదని ఆమె చెప్పినట్టు సమాచారం.

చివరి దశకు విచారణ

టాలీవుడ్‌ మత్తుమందుల కేసులో నిధుల మళ్లింపును నిగ్గు తేల్చేందుకు ఈడీ చేపట్టిన విచారణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకూ పది మందిని విచారించారు. ఇంకా తనీష్‌, తరుణ్‌ మాత్రమే మిగిలారు. వచ్చే శుక్రవారం తనీష్‌, ఆ తర్వాత బుధవారం తరుణ్‌ హాజరు కానున్నారు. వీరి విచారణ పూర్తయిన తర్వాత నిధుల మళ్లింపు కేసులో ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని