ప్రజాస్వామ్యానికి తల్లి.. భారత్‌

ప్రధానాంశాలు

ప్రజాస్వామ్యానికి తల్లి.. భారత్‌

మన రాజ్యాంగం ఒక జీవనధార
సామాన్యుడికి మరింత చేరువగా పార్లమెంటు చర్చలు
సంసద్‌ టీవీ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

ఈనాడు, దిల్లీ: ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ‘‘ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావించినప్పుడు భారత్‌ బాధ్యత ఎంతో పెరుగుతుంది. మన దేశంలో ప్రజాస్వామ్యమన్నది పార్లమెంటు నిర్మించిన ఒక వ్యవస్థ మాత్రమే కాదు... ఆలోచన కూడా. అదో స్ఫూర్తి. రాజ్యాంగం అన్నది అధికరణ సంకలనం ఒక్కటే కాదు. అదో జీవనధార’’ అని చెప్పారు. ఇప్పటివరకు ఉన్న రాజ్యసభ, లోక్‌సభ టీవీలను కలిపి కొత్తగా ఏర్పాటు చేసిన సంసద్‌ టీవీని బుధవారం ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాలతో కలిసి ప్రారంభించిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నాడు ఈ ఛానల్‌ ప్రారంభం కావడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులకు కొత్త గొంతు

‘‘కాలంతోపాటు మీడియా, టీవీ ఛానళ్ల భూమిక వేగంగా మారుతోంది. సంసద్‌ ఛానల్‌ కూడా ఈ ఆధునిక వ్యవస్థతోపాటు మార్పు చెందడం సంతోషకరం. ప్రజాస్వామ్యానికి, ప్రజా ప్రతినిధులకు కొత్త గొంతు రూపంలో సంసద్‌ టీవీ పనిచేస్తుంది. సామాజిక మాధ్యమాలు, ఓటీటీ ప్లాట్‌ఫాం, సొంత యాప్‌పై కొత్త అవతారంలో ఇది అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల పార్లమెంటు చర్చలు సామాన్యుడికి మరింత చేరువవుతాయి. అమృతోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్య్ర పోరాటంతో ముడిపడిన 75 ఎపిసోడ్లను ప్రసార మాధ్యమాలు ప్రసారం చేయొచ్చు. అమృత్‌ మహోత్సవానికి సంబంధించిన విషయాలకు పత్రికలు ప్రచారం కల్పించవచ్చు. సమాచారం బలంగా ఉంటే ప్రజలు అనుసంధానం అవుతారు. అది మీడియాతో పాటు, పార్లమెంటు వ్యవస్థకూ వర్తిస్తుంది. పార్లమెంటులో వివిధ అంశాలపై చర్చ జరుగుతుంది. తద్వారా యువత ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి వీలవుతుంది. వాటిని ప్రజలకు అనుసంధానం చేసినప్పుడు ఉత్తమ చర్చలకు ప్రోత్సాహం లభిస్తుంది. సంసద్‌ టీవీ ప్రజానుకూల కార్యక్రమాలు నిర్వహించాలి. భాషపై దృష్టిపెట్టాలి. స్థాయీ సంఘాలు, శాసనసభల కార్యకలాపాల గురించీ ప్రజల ముందుకు సంసద్‌ టీవీ తీసుకురానున్నందున ప్రజాస్వామాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. పంచాయతీలకు సంబంధించిన కార్యక్రమాలనూ ఈ ఛానల్‌ తీసుకురానుంది’’ అని ప్రధాని వివరించారు.


కళ్లు, చెవులు మీడియానే: వెంకయ్యనాయుడు

ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు ప్రసంగించారు.  ‘‘దేశంలో మీడియా విస్తరణ అనూహ్యంగా ఉంది. ఇటీవలి కాలంలో సామాజిక, డిజిటల్‌ మీడియా వేగంగా విస్తరిస్తున్నాయి. సమాచారం క్షణాల్లో తెలుసుకోవడానికి, తక్షణం ఇతరులతో పంచుకోవడానికి వీలవుతోంది. వేగంగా, అందరికంటే ముందుగా బ్రేకింగ్‌ న్యూస్‌ ఇవ్వాలన్న పోటీ కారణంగా అప్పుడప్పుడూ మిగతా అంశాలు పక్కకు పోతున్నాయి. ప్రస్తుతం మనం నకిలీ, సంచలనాత్మక కథనాల సవాళ్లను ఎదుర్కొంటున్నాం. అబద్ధాల నుంచి నిజాలను వేరుచేయడం ప్రధాన సమస్యగా మారింది. ఏళ్ల తరబడి మన మీడియా తన స్వేచ్ఛను సంరక్షించుకుంటూ వస్తున్నందుకు అందరూ గర్వించాలి. ఆందోళనలు, నినాదాల మాటున ప్రజల గొంతును నొక్కేయకూడదు. సమస్యలకు పరిష్కారం చూపేలా చర్చలు సాగాలి. పార్లమెంటు మన ప్రజాస్వామ్య హృదయమైతే, మీడియా కళ్లు, చెవులు లాంటిది. అందువల్ల రెండు వ్యవస్థలూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా మనం చూసుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ- పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థల కార్యకలాపాలు, ప్రజాప్రతినిధుల పనితీరు గురించి ప్రజల ముందుకు సంసద్‌ టీవీ తీసుకొస్తుందన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని