నువ్వా.. నేనా!

ప్రధానాంశాలు

నువ్వా.. నేనా!

ఉత్తర, దక్షిణకొరియా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
పోటాపోటీగా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాలు  
అమెరికా, జపాన్‌ ఆందోళన

సియోల్‌: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వేడి రాజుకుంది. బుధవారం రెండు దేశాలు పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. తొలుత ఉత్తర కొరియా రెండు స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. అనంతరం కొద్ది గంటలకే.. దక్షిణ కొరియా తన తొలి జలాంతర బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించింది. దేశీయంగా తయారు చేసిన క్షిపణిని మూడు వేల టన్నుల బరువైన సబ్‌మెరైన్‌ నుంచి ప్రయోగించినట్లు దక్షిణ కొరియా అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రణాళిక ప్రకారం నిర్దిష్ట దూరాన్ని చేరిన తర్వాత క్షిపణి లక్ష్యాన్ని ఛేదించిందని స్పష్టం చేసింది. ఆత్మరక్షణ కోసం, విదేశాల నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి ఈ ఆయుధం ఉపయోగపడుతుందని అధ్యక్ష భవనం పేర్కొంది. అయితే, అంతకుముందు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నేతృత్వంలోని ఉత్తర కొరియా రెండు స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. వీటిని దక్షిణ కొరియా గుర్తించింది. సెంట్రల్‌ నార్త్‌ కొరియా నుంచి వీటిని ప్రయోగించారని తెలిపింది. క్షిపణులు 800 కి.మీ ప్రయాణించి కొరియా ద్వీపకల్పానికి, జపాన్‌ అంతర్జాతీయ జలాలకు మధ్య ల్యాండ్‌ అయ్యాయని వెల్లడించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ దక్షిణ కొరియా పర్యటలో ఉన్నప్పుడే ఉత్తరకొరియా ఈ ప్రయోగం జరపడం విశేషం. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలను జపాన్‌ ఖండించింది. క్షిపణి ప్రయోగాలు ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు భంగం కలిగిస్తాయని జపాన్‌ ప్రధాని యొషిహిదె సుగా పేర్కొన్నారు. అమెరికా కూడా స్పందించింది. ఇది ఐరాస భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కిమ్‌.. కవ్వింపు చర్యలు

అమెరికాతో అణు చర్చల్లో పురోగతి లేని నేపథ్యంలో.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నేతృత్వంలో ఉత్తరకొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అందులో భాగంగానే సోమవారం క్రూయిజ్‌ క్షిపణిని పరీక్షించింది. ఇప్పుడే ఏకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ బాలిస్టిక్‌ క్షిపణులనే ప్రయోగించింది. మరోవైపు ఉత్తరకొరియా కవ్వింపు చర్యలకు రెచ్చిపోకుండా ప్రశాంతంగా ఉండే దక్షిణ కొరియా ఈసారి తీవ్రస్థాయిలో స్పందించడం విశేషం. సాధారణంగా.. దక్షిణ కొరియా తన ఆయుధ ప్రయోగాలకు సంబంధించిన విషయాలను బహిరంగంగా వెల్లడించదు.  ప్రత్యర్థి దేశమైన ఉత్తరకొరియాను రెచ్చగొట్టకుండా నిశబ్దంగానే ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ ఉంటుంది. దక్షిణ కొరియా చర్యల వల్ల తమ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత తీవ్రంగా దెబ్బతింటాయని కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ హెచ్చరించారు. అయితే, ఉత్తర కొరియా విషయంలో మెతక వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. మూన్‌ జే ఇన్‌ సర్కారు బహిరంగంగా ఈ పరీక్షలు చేపట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని