రాష్ట్రంలో ‘మలబార్‌’ రూ.750 కోట్ల పెట్టుబడి

ప్రధానాంశాలు

రాష్ట్రంలో ‘మలబార్‌’ రూ.750 కోట్ల పెట్టుబడి

వజ్ర, స్వర్ణాభరణాల తయారీ, శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయం
2,500 మంది స్వర్ణకారులకు ఉపాధి
కేటీఆర్‌తో సంస్థ ఛైర్మన్‌ అహ్మద్‌ భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: కేరళకు చెందిన ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థ మలబార్‌ గ్రూప్‌ తెలంగాణలో రూ.750 కోట్లతో వజ్ర, స్వర్ణాభరణాల తయారీ, శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా 2,500 మంది స్వర్ణకారులకు ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తామని ఆ సంస్థ తెలిపింది. తెలంగాణ పారిశ్రామిక విధానం, ప్రభుత్వ స్నేహపూర్వక దృక్పథం, మార్కెటింగ్‌, నాణ్యమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మలబార్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎంపీ అహ్మద్‌, ఇతర ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ నిర్ణయాన్ని తెలిపారు. మలబార్‌ గ్రూప్‌ భారత్‌తోపాటు అమెరికా, యూఏఈ, సింగపూర్‌, కువైట్‌, బహ్రెయిన్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ ఆరేబియా, మలేసియాలలో 260 బంగారం, వజ్రాలు, వెండి నగల దుకాణాలను నిర్వహిస్తోంది. సంస్థ విస్తరణకు వివిధ రాష్ట్రాలను పరిశీలించిన అనంతరం తెలంగాణను ఎంచుకున్నామని అహ్మద్‌.. కేటీఆర్‌కు తెలిపారు. 2,500 మంది స్వర్ణకారులకు ఉపాధిని అందిస్తామన్నారు.

ఆభరణాల తయారీ హబ్‌ అవుతుంది: కేటీఆర్‌

మలబార్‌ సంస్థ భారీ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకురావడంపై మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.  మలబార్‌ పరిశ్రమ ద్వారా ఆభరణాల తయారీ హబ్‌గానూ తెలంగాణ  మారుతుందన్నారు. అద్భుతమైన నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్నారని, కంపెనీ ఇచ్చే ఉద్యోగాల్లో వారందరినీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ‘మలబార్‌’కు అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫు నుంచి అందిస్తామని, సంస్థ రాష్ట్రంలో మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని