స్పందించిన ‘హృదయం’

ప్రధానాంశాలు

స్పందించిన ‘హృదయం’

సొంత గడ్డకే చేరిన గుండె చప్పుడు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్‌ అవయవదానం
దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే గ్రహీతకు చేరిన వైనం

ఈనాడు, హైదరాబాద్‌, కూసుమంచి, న్యూస్‌టుడే: మరణించినా.. జన్మించడం కొందరికే సాధ్యం. ఎంతో కష్టపడి పోలీసు కొలువు సాధించాడు. రేపటి స్వప్నం కోసం కలలు కన్నాడు.. అవి నెరవేరకముందే ఈ లోకం విడిచి వెళ్లిపోయాడు. రోడ్డు ప్రమాదంలో ఊపిరి వదిలినా.. అవయవదానంతో ఒకరికి బతుకునిచ్చాడు. ఆ విధి ఆడిన వింత నాటకంలో తిరిగి ఆ గుండె పుట్టిన గడ్డకే చేరింది. అవయవ దాత, గ్రహీత ఇద్దరూ ఒకే మండలానికి చెందినవారు. భౌతికంగా దూరమైనా తిరిగి సొంత ఊరికే ఆ గుండె చేరుతోందని కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులు భావోద్వేగానికి గురవుతున్నారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రానికి చెందిన నలగాటి వీరబాబు(32) కొండాపూర్‌ స్పెషల్‌ బ్రాంచి ఎనిమిదో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌. ఈ నెల 12న ఖమ్మం గ్రామీణ మండలంలోని గొల్లగూడెం వద్ద రహదారి ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఇతన్ని తొలుత ఖమ్మంకు, మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌ యశోద ఆసుపత్రికు తరలించారు. చికిత్స పొందే క్రమంలో బుధవారం ఇతను బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో వీరబాబు అవయవాల కోసం జీవన్‌దాన్‌ సంస్థ సభ్యులు ఇతని తల్లిదండ్రులు వెంకన్న, మంగమ్మ, సోదరుడు నాగేశ్వరరావును సంప్రదించగా వారు స్వాగతించారు. దీంతో వైద్యులు తగు ఏర్పాట్లు చేశారు.

ఐదేళ్లుగా బాధపడుతూ..

ఇదే మండలంలోని మునిగెపల్లి గ్రామానికి చెందిన తుపాకుల హుస్సేన్‌ (29) ఐదేళ్ల నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అతని హృదయ స్పందన సరిగ్గాలేకపోవడంతో మరొకరి గుండె అమర్చితేనే అతని జీవితమని వైద్యులు తేల్చి చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు ఆ వ్యక్తి మంగళవారమే జీవన్‌దాన్‌లో తన పేరు నమోదు చేయించుకున్నారు. గత పది రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం ఇంటికి రావాల్సి ఉండగా(డిశ్చార్జీ) అంతలోనే అందిన సమాచారంతో ఆసుపత్రిలోనే ఆగిపోయారు. వీరబాబు గుండెను సమకూర్చిన జీవన్‌దాన్‌ సంస్థ ద్వారా వైద్యులు గుండె మార్పిడి చేశారు. దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే గుండె మార్చడం గమనార్హం. ‘మాకు ఆరేళ్లు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. తండ్రిలేని వారవుతారని భయమేసింది. 24 గంటల్లోనే గుండె దొరికిందని జీవన్‌దాన్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఓవైపు ఆనందంగా అనిపించినా.. మరోవైపు ఆ కుటుంబం పడుతున్న బాధ కళ్లముందు కదలాడింది. వారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం’ అని తుపాకుల హుస్సేన్‌ భార్య భావోద్వేగంతో చెప్పారు.

13 నిమిషాల్లో నిమ్స్‌కు.. ఐదుగంటల్లో గుండెమార్పిడి

అవయవ దాత నుంచి సేకరించిన గుండె మలక్‌పేట యశోద ఆసుపత్రిలో ఉంది. గ్రహీత పంజాగుట్టలోని నిమ్స్‌లో ఉన్నారు. రెండు ఆసుపత్రుల మధ్య దూరం 9.5 కి.మీ. సాధారణ సమయాల్లో గంట ప్రయాణం.హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల సాయంతో గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ప్రత్యేక అంబులెన్స్‌లో బుధవారం మధ్యాహ్నం 1.42 గంటలకు మలక్‌పేట నుంచి బయల్దేరి నిమ్స్‌కు మధ్యాహ్నం 1.56 గంటలకల్లా అంటే కేవలం 13 నిమిషాల్లో చేర్చారు. అనుకున్న సమయంకంటే ముందే తీసుకొచ్చిన డ్రైవర్‌ బాబాను అందరూ ప్రశంసించారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభమైన గుండె మార్పిడి ప్రక్రియ రాత్రి 7 గంటలకు ముగిసింది. ఈ ప్రక్రియలో ఆసుపత్రి కార్డియో థొరాసిక్‌ వైద్యులు.. ఎ.అమరేశ్వరరావు, మధుసూదన్‌, కళాధర్‌, గోపాల్‌, అనస్తీషియా వైద్యులు.. పద్మజ, నర్మద, ప్రాచి, అర్చనతో పాటు మొత్తం 20 మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని