చిదిమేసినోడు ఛిద్రమయ్యాడు

ప్రధానాంశాలు

చిదిమేసినోడు ఛిద్రమయ్యాడు

ఆరేళ్ల చిన్నారి హత్యాచార నిందితుడి ఆత్మహత్య

  స్టేషన్‌ఘన్‌పూర్‌ వద్ద  రైలు కింద పడి మృతి

  అది ఆత్మహత్యే: పోస్టుమార్టం నివేదిక

  బాధిత కుటుంబసభ్యులకు మంత్రుల పరామర్శ

  రూ. 20 లక్షల చెక్కు అందజేత

ఈనాడు, వరంగల్‌, హైదరాబాద్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, న్యూస్‌టుడే : ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల సమీపంలో రైల్వే పట్టాలపై పల్లకొండ రాజు శవమై తేలాడు.హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఈ నెల 9న చిట్టితల్లిని హత్యాచారం చేసిన ఘటనలో నిందితుడైన రాజు కొన్ని రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న విషయం విదితమే. అతనిపై రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. గురువారం ఉదయం వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. చిల్పూరు మండలం నష్కల్‌, ఘన్‌పూర్‌ స్టేషన్‌ మధ్య రాజారం వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతదేహానికి రాత్రి ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. రాజు శరీరంపై కొట్టినట్లు, చిత్రహింసలు పెట్టినట్లు గానీ, తూటా గాయాలు గానీ లేవని, రైలు ప్రమాదంలో పట్టాలు గీరుకుపోయిన ఆనవాళ్లు, నల్లటి గ్రీజు మాత్రమే ఉన్నట్లు ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాజామాలిక్‌ తెలిపారు. గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌ (జీఆర్‌పీ) ఎస్పీ అనురాధ కాజీపేటలో మాట్లాడుతూ రాజుది ఆత్మహత్య అని నిర్ధారించామని, రైల్వే చట్టాల ప్రకారం కేసు నమోదు చేశామని చెప్పారు.నిందితుడిని పోలీసులు పట్టుకెళ్లి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోపక్క మృతిచెందిన చిన్నారి కుటుంబసభ్యులను హోం మంత్రి మహమూద్‌ అలీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లతో పాటు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శర్మణ్‌, నగర కోత్వాల్‌ అంజనీకుమార్‌ పరామర్శించారు. రూ.20 లక్షల చెక్కును, రెండు పడక గదుల ఇంటిని మంజూరు చేస్తూ సంబంధిత పత్రం అందజేశారు. ప్రభుత్వ శాఖలో పొరుగుసేవల కింద ఉద్యోగం ఇస్తున్నామని చెప్పగా.. తాను ఆటోడ్రైవర్‌ అని, కారు ఇప్పిస్తే బాగుంటుందని చిన్నారి తండ్రి చెప్పడంతో వారు సమ్మతించారు. మూడు రోజుల్లో కారు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. 

శరీరంపై గుర్తుల ఆధారంగా...

రైలు ఢీకొనడంతో రాజు శరీరం ఛిద్రమైంది. ముఖం నుజ్జునుజ్జయ్యింది. కీమెన్‌ సారంగం నష్కల్‌ స్టేషన్‌ మాస్టర్‌ హరిశంకర్‌, ఘన్‌పూర్‌ పోలీసులకు సమాచారమిచ్చారు.  మృతుని చేతిపై అతని భార్య మౌనిక పేరు పచ్చబొట్టుగా ఉండడంతో పాటు, శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా ఈ మృతదేహం రాజుదే అని ఎస్‌ఐలు రమేశ్‌నాయక్‌, శ్రీనివాస్‌ నిర్ధారించి ఉన్నతాధికారులకు తెలిపారు. ఘటనాస్థలంలో ఓ సెల్‌ఫోన్‌ ముక్కలై కనిపించగా, మరో పది రూపాయల నోటు పట్టాలపై పడి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించే లోపు సుమారు అయిదు రైళ్లు మృతదేహంపై నుంచి వెళ్లాయి. విషయం తెలిసిన వెంటనే ఘన్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి వరుసకట్టారు. అతను చేసిన పాపానికి ఇదే సరైన శిక్ష అంటూ తిట్టిపోశారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం తరలించారు. రాజు బావమరుదులు మార్చురీకి వచ్చి గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం వరంగల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

24 గంటల్లో ఏమీ తినలేదు

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: రాజుది ఆత్మహత్యే అని పోస్టుమార్టం నివేదికలో తేలింది.  పోస్టుమార్టం నివేదికలో ఏం తేలిందనే విషయంపై ఎంజీఎం మార్చురి ఫొరెన్సిక్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాజామాలిక్‌తో ‘న్యూస్‌టుడే’ మాట్లాడింది. నిందితుడి కుటుంబసభ్యులు ఆరోపించినట్లుగా రాజు శరీరంపై ఎలాంటి గాయలు లేవన్నారు. నిందితుడు ఆత్మహత్య చేసుకోవడానికి 24 గంటల ముందు ఏమీ తినలేదని, పొట్టలో పింక్‌ ద్రవపదార్థాలు ఉండటంతో అనుమానంతో విత్‌డ్రా పరీక్ష కోసం 50 గ్రాముల ద్రవపదార్థాలను సేకరించి హైదరాబాద్‌ ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. చిన్నారి అత్యాచారం చేసింది మృతుడు రాజునేనా అని నిర్ధారణ చేసుకోవడానికి మృతుడికి డీఎన్‌ఏ పరీక్ష చేసినట్లు తెలిపారు.  పోస్టుమార్టం మొత్తం వీడియో చిత్రికరణలో పూర్తిచేసినట్లు వివరించారు.

ఆ మృగం చనిపోయింది : కేటీఆర్‌

ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయిందని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో మృతదేహాన్ని గుర్తించినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 


రైలుకు ఎదురెళ్లి...

ఆత్మహత్య సంఘటన గురించి పోలీసులు, కీమెన్‌ సారంగం, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నష్కల్‌ ఘన్‌పూర్‌ మధ్య విధులు నిర్వహిస్తున్న కీమెన్‌ సారంగం ఉదయం 8.40 గంటలకు ఒక వ్యక్తి పట్టాలపై ఉండడం చూసి... కాగితాలేరుకునే వ్యక్తి అని భావించాడు. జులపాలతో, ముఖానికి మాస్కు పెట్టుకొని కనిపించిన అతన్ని నీ పేరేంటని అడగ్గా, నీకెందుకురా అంటూ దురుసుగా సమాధానమిచ్చాడు. అప్పటికే గూడ్సు రైలు వస్తుండగా, పక్కకు తప్పుకోరా అంటూ రాళ్లతో సారంగం అతన్ని అదిలించగా, పక్కనున్న చెట్ల గుబుర్లోకి వెళ్లి దాక్కున్నాడు. సామాజిక మాధ్యమాల్లో చూసిన రాజు ఇతనే అనే అనుమానంతో సారంగం పట్టుకోవాలనుకున్నాడు. పక్కన పొలంలో ఉన్న రైతు సోదరులు భుక్యా గేమ్‌సింగ్‌, రామ్‌సింగ్‌లను పిలిచాడు. వారు వచ్చే లోపే మళ్లీ ట్రాక్‌పైకి వచ్చిన రాజు కాజీపేట నుంచి జనగామ వైపు సుమారు 90-100 కి.మీ. వేగంతో వస్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.


కంట్రోల్‌ రూంకు డ్రైవర్‌ సమాచారం

కాజీపేట, న్యూస్‌టుడే : నష్కల్‌ సమీపంలో పొదల మాటు నుంచి గుర్తుతెలియని వ్యక్తి రైలుకు 90-100 మీటర్ల దూరంలో ఉండగా ఒక్కసారిగా పట్టాల మధ్యకు పరుగున వచ్చాడని..ఆయన మరణించి ఉంటాడని కోణార్క్‌ రైలు డ్రైవర్‌ సికింద్రాబాద్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌లో సమాచారం అందించారు. అప్పుడు రైలు 90-100 కి.మీ వేగంతో నడుస్తుందని చెప్పారు. ఎవరైనా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే ముందుగా రైలు డ్రైవర్‌ గమనిస్తాడు. ఆ తర్వాత వచ్చే స్టాప్‌లో స్టేషన్‌మాస్టర్‌కు సమాచారమివ్వాలి. గతంలో రైలును ఆపి రాతపూర్వకంగా వివరాలిచ్చేవారు. వాకీటాకీలు వచ్చాక దాని ద్వారానే చెప్పేవారు. ఇప్పుడు సికింద్రాబాదులోని కంట్రోల్‌ రూంకు నేరుగా ఫోన్‌ చేసి వివరాలు అందిస్తున్నారు. డ్రైవర్‌ సమాచారం ఆధారంగా జీఆర్‌పీ పోలీసులు రాజుది ఆత్మహత్యగా నిర్ధారణకు వచ్చారు.  రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నా లేదా ప్రమాద సంఘటనల్లో రైలు పట్టాల మీద రక్తం కారుతుంది. పట్టాల మీద తల పెట్టినప్పుడు తలవెంట్రుకలు అతుక్కుంటాయి. నష్కల్‌ సంఘటనల్లో ఈ రెండు ఆధారాలు సేకరించారు. ఒక వేళ ముందుగానే చనిపోయన వ్యక్తిని రైలు పట్టాల మీద పడుకోపెడితే రక్తం కారదని... ఈ సంఘటనలో పట్టాల మీద రక్తం ఉంది కాబట్టి ఇది ఆత్మహత్యే అంటున్నారు.


ప్రాణం ఎక్కువ అనుకున్నా

నష్కల్‌ నుంచి ఘన్‌పూర్‌ వరకు పట్టాలను పరిశీలిస్తున్న క్రమంలో సుమారు 8.40 గంటల ప్రాంతంలో రాజు కనిపించాడు. ముఖానికి మాస్కు పెట్టుకొని జుంపాలతో ఉన్నాడు. ఇటీవల సోషల్‌ మీడియాలో చూసిన కాబట్టి ఇతనే రాజు అని అనుమానం వచ్చింది.  రైలుకు ఎదురుగా వెళుతుంటే వద్దన్నా. రూ.పది లక్షల కన్నా ప్రాణమే ఎక్కువ అనిపించి, పక్కకు తప్పుకోమన్నా, నేను అరవడం వల్లే మొదట గూడ్సు రైలుకింద పడలేదు. తర్వాత కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రావడంతో దాని ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

- సారంగం, కీమెన్‌


నేనే పోలీసులకు ఫోన్‌ చేశా

కీమెన్‌ సారంగం మొదట భుక్యా గేమ్‌సింగ్‌ వాళ్ల తమ్ముడు రామ్‌సింగ్‌ను పిలిచాడు. దూరం నుంచి పట్టాలపై ఏదో జరుగుతుందని చూసి వచ్చాను. అప్పటికే రాజు రైలు కింద పడ్డాడు. కుడి చేయిపై తెలుగులో మౌనిక అని రాసి ఉంది.  ఇతనే  నిందితుడని అనుకున్నా. పోలీసు ఠాణాకు ఫోన్‌ చేశా. 

- బుక్యా సురేశ్‌, స్థానికుడు


రైలుకు ఎదురుగా పోవడం చూశాను

ఒకతను రైలు కింద పడుతుంటే కీమెన్‌ సారంగం తరుముతుండటం చూసిన. తర్వాత భయపడి మమ్మల్ని పిలిచాడు. నేను మా తమ్ముడు రామ్‌సింగ్‌ పొలం నుంచి పట్టాలమీదకు వస్తుండగానే రాజు రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

- భుక్యా గేమ్‌సింగ్‌, రైతు


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని