కేంద్రం ఇచ్చింది రూ.2,71,208 కోట్లు

ప్రధానాంశాలు

కేంద్రం ఇచ్చింది రూ.2,71,208 కోట్లు

 రూ.1.46 లక్షల కోట్లేనంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

పాదయాత్రలో బండి సంజయ్‌

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: ఏడేళ్లలో వివిధ రకాలుగా తెలంగాణకు కేంద్రం రూ.2,71,208 కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. పన్నుల వాటా, సంక్షేమ పథకాలు, జాతీయ రహదారుల నిర్మాణం, కరోనా ఉచిత టీకా పంపిణీ నిమిత్తం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నా కేంద్రానికి కనీసం కృతజ్ఞతలు చెప్పనిది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరేనని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించి జీతాలుఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి తెచ్చారని ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్‌ను సవాల్‌ విసరమనండి సమాధానం చెబుతానన్నారు.  ప్రధాని వద్దకు పోయిన ముఖ్యమంత్రి నిధులపై ఆయన్ను ఎందుకు నిలదీయలేదన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బంజారా తండా సమీపంలో బసచేసిన ఆయన గురువారం ఉదయం స్థానిక నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్రం ఏడేళ్లుగా ఇచ్చిన నిధులను గణాంకాలతో వివరించారు.

కేసీఆర్‌ ముందుకొస్తే నిరూపణకు సిద్ధం

ఏడేళ్లలో తెలంగాణ పన్నుల రూపేణా రూ.2.72 లక్షల కోట్లు చెల్లిస్తే కేంద్రం రూ.1.46 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందంటూ రాష్ట్ర మంత్రులు పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సంజయ్‌ ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రం ఇచ్చిన నిధులపై మాట్లాడేందుకు ముందుకొస్తే లెక్కలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరిగినట్లు నిర్ధారణ జరిగితే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి వాస్తవాలు తెలుపుతానని ముందుకొచ్చారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం అన్యాయం చేస్తుంటే పార్లమెంటులో తెరాస ఎంపీలు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తెరాస నాయకులు, మంత్రులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని