కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అధికారం లేదు

ప్రధానాంశాలు

కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అధికారం లేదు

 తెలంగాణ తీరు అభ్యంతరకరం

సీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ఏపీ వాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే Åఅధికారం జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)కి లేదని గురువారం ఏపీ ప్రభుత్వం చెన్నైలోని ఎన్జీటీకి నివేదించింది. ట్రైబ్యునల్‌కు ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పనులను ఏపీ చేపట్టిందని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ జి.శ్రీనివాస్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లపై ఎన్జీటీ జ్యుడీషియల్‌ సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సాంకేతిక సభ్యులు డాక్టర్‌ కె.సత్యగోపాల్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ తరఫున న్యాయవాదులు వెంకటరమణి, డి.మాధురిరెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్జీటీ చట్టం ప్రకారం కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అధికారం ట్రైబ్యునల్‌కు లేదన్నారు. అలాగైతే తమ ఉత్తర్వులను ఉల్లంఘిస్తుంటే చూస్తుండాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందని తెలంగాణ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు, పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌లు స్పష్టంచేశారు. దీనిపై వాదనల నిమిత్తం విచారణకు ఈనెల 21కి వాయిదా వేసింది.

కల్పిత వీడియోలు సమర్పించింది: ఏపీ

తప్పుడు సాక్ష్యంగా కల్పిత వీడియోను సమర్పించిన తెలంగాణపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈమేరకు ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఎన్జీటీలో అఫిడవిట్‌ దాఖలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై పూర్తి వివరాలతో తాము కౌంటరు దాఖలు చేశామన్నారు. అనుకూల ఉత్తర్వులు పొందాలన్న దురుద్దేశంతో తప్పుడు ఆధారాలు తెలంగాణ సమర్పించిందని ఆరోపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని