‘పాలమూరు-రంగారెడ్డి’ పనులపై ప్రశ్నల వర్షం

ప్రధానాంశాలు

‘పాలమూరు-రంగారెడ్డి’ పనులపై ప్రశ్నల వర్షం

లోతుగా వివరాలు సేకరించిన కమిటీ

మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌: జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) చెన్నై బెంచ్‌ ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పనులపై లోతుగా వివరాలు సేకరించింది. సాగునీరు, మైనింగ్‌, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులను కమిటీ సభ్యులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన పర్యావరణ ఉల్లంఘనలపై రెండోరోజు గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో వీరు పర్యటించారు. భూత్పూర్‌ మండలంలోని కర్వెన జలాశయం 13వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులున్నాయా? ఎప్పుడు తీసుకున్నారు? దేనికోసం తీసుకున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలిదశలో తాగునీటి కోసం ప్రాజెక్టు పనులకు అనుమతి తీసుకున్నామని, రెండోదశలో సాగునీటి కోసం పనులు చేపట్టనున్నట్లు వివరించారు. కమిటీ సభ్యులు జోక్యం చేసుకుంటూ మరి తొలిదశలోనే సాగునీటి పనులను ఎందుకు చేపట్టారని ప్రశ్నించినట్లు సమాచారం. ఒకదశలో సొరంగం, పంపుహౌస్‌ పనుల డిజైన్‌పై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు పొంతన లేకుండా సమాధానం చెప్పడంతో కమిటీ సభ్యులు జోక్యం చేసుకుంటూ మీలో సమన్వయం లేనట్లు ఉందని సాగునీటిపారుదల శాఖ ముఖ్య అధికారి ఒకరిని ప్రశ్నించారు. అనంతరం జడ్చర్ల మండలంలో ఉదండాపూర్‌ జలాశయం పనులను పరిశీలించారు. కట్ట నిర్మాణానికి నల్లమట్టిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటూ అడగగా, ముంపు ప్రాంతాల నుంచి తీసిన మొరం జలాశయం కట్ట నిర్మాణానికి వాడుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ మట్టిని ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? అనుమతులు ఉన్నాయా? సీనరేజీ ఛార్జీలు చెల్లిస్తున్నారా? అని ప్రశ్నలు గుప్పించారు. చెరువుల్లో పూడిక తీసిన మట్టిని తరలించామని జిల్లా కలెక్టరు వెంకట్‌రావు వివరించారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీశామని, దీనిద్వారా లబ్ధి చేకూరిందని చెప్పారు. అక్రమంగా మట్టి తరలింపు ఎక్కడా జరగలేదా అని కమిటీ సభ్యులు ప్రశ్నించగా, మట్టికి సంబంధించిన సీనరేజి ఛార్జీలను మైనింగ్‌ శాఖకు చెల్లించినట్లు కలెక్టర్‌ చెప్పారు. తర్వాత జడ్చర్ల, నవాబుపేట మండలాల్లో నల్లమట్టిని తరలించిన చెరువులను పరిశీలించారు. కమిటీ సభ్యులు ఆర్కియా లెనిన్‌, పూర్ణిమ, మేఘనాథన్‌, రమేష్‌కుమార్‌, మౌంతంగ్‌ పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని