ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

ప్రధానాంశాలు

ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం మేరకు గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో బాజిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావించినా....అనివార్య కారణాల వల్ల ఆ పదవి దక్కలేదని సమాచారం. దీంతో ఆయనను ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించాలని ముఖ్యమంత్రి యోచించినా మొదట్లో దీనికి బాజిరెడ్డి నిరాకరించారని తెలిసింది. తాజాగా ఆయన సీఎంను కలిసినప్పుడు ఈ అంశం చర్చకు రాగా ముఖ్యమంత్రి ఒప్పించినట్లు పార్టీ వర్గాల సమాచారం. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం రావుట్లలో జన్మించిన గోవర్ధన్‌.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. 1999లో ఆర్మూర్‌ నుంచి, 2004లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెరాస పార్టీ తరఫున 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

ఆర్టీసీలో వ్యాక్సినేషన్‌ పూర్తి: సజ్జనార్‌

తెలంగాణ ఆర్టీసీలో నూటికి నూరు శాతం మంది ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని స్థాయుల ఉద్యోగులకు రెండు డోసులు ఇచ్చామన్నారు. 48,214 మంది ఉద్యోగుల్లో 4,486 మంది మహిళలున్నారని, వీరందరూ వ్యాక్సిన్లు తీసుకున్నారన్నారు. ప్రజలు నిస్సంకోచంగా ప్రయాణాలు చేయవచ్చన్నారు. డిపో నుంచి బయటకు వచ్చే ముందు బస్సులను పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ చేయిస్తున్నామని తెలిపారు. ‘మీరు, మేము, అందరం’ అనే తీరులో సంస్థ సేవలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సజ్జనార్‌ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాల మేరకు

ఆర్టీసీని బతికించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన. ఆయన ఆశయాల మేరకు పని చేస్తా. సంస్థను గాడిలో పెట్టేందుకు నా వంతు కృషి చేస్తా. ఇప్పటికే మంచి అధికారిని ఎండీగా నియమించారు. సమన్వయంతో పని చేసి ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తాం. ముఖ్యమంత్రిని కలిసిన తరువాత త్వరలో బాధ్యతలు స్వీకరిస్తా.

- బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని