చంద్రబాబు ఇంటిపైకి దండయాత్ర

ప్రధానాంశాలు

చంద్రబాబు ఇంటిపైకి దండయాత్ర

అనుచరులతో కలిసి వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌ దాడికి యత్నం

అడ్డుకున్న తెదేపా శ్రేణులు... కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు

ఆలస్యంగా చేరుకున్న పోలీసులు... తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జి

పలువురికి గాయాలు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తాడేపల్లి: కృష్ణా నది తీరంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తెదేపా అధినేత చంద్రబాబు నివాస ప్రాంతం శుక్రవారం రణరంగాన్ని తలపించింది. అధికార పార్టీకి చెందిన పెడన శాసనసభ్యుడు జోగి రమేష్‌ పెద్దసంఖ్యలో తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి, జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు రావడం, ఆ సందర్భంగా కర్రలు, రాళ్లతో వైకాపా, తెదేపా నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు దిగడం, పోలీసుల లాఠీఛార్జితో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాళ్ల దాడి, పోలీసుల లాఠీఛార్జిలో పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలు, కొందరు మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. కొందరు వైకాపా కార్యకర్తలకూ దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో చంద్రబాబు తన నివాసంలోనే ఉన్నారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు... ముఖ్యమంత్రి జగన్‌, హోం మంత్రి సుచరిత తదితరులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ, దానికి నిరసనగా చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు జోగి రమేష్‌ ప్రయత్నించారు. ఆయన, వైకాపా కార్యకర్తలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుమారు 15-20 వాహనాలతో కృష్ణా కరకట్ట పైకి వచ్చారు. చంద్రబాబు ఇంటి సమీపానికి రాగానే వాహనాలు ఆపి... కర్రలకు అమర్చిన పార్టీ జెండాలు పట్టుకుని వైకాపా కార్యకర్తలు, రమేష్‌ అనుచరులు దిగి, చంద్రబాబు ఇంటి వైపు దూసుకెళ్లారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి వెళుతున్న విషయాన్ని కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులకు రమేష్‌ ముందే తెలియజేశారు. విషయం తెలియడంతో... ఆ సమయానికి తెదేపా కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పట్టాభిరామ్‌, నాగుల్‌మీరా తదితర నాయకులు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. రమేష్‌ వాహనశ్రేణి చంద్రబాబు ఇంటివరకు వచ్చిందని తెలియడంతో... వారంతా కరకట్టపై ఉన్న ప్రధాన బారికేడ్‌ వద్దకు వచ్చారు. జోగి రమేష్‌ వాహనాన్ని చంద్రబాబు నివాసం వైపు మళ్లించడంతో... తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబు ఇంటిని ఎలా ముట్టడిస్తారని, వెనక్కి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెదేపా నాయకుడొకరు జోగి రమేష్‌ వాహనం అద్దంపై బలంగా కొట్టారు. వెంటనే రమేష్‌ కిందకు దిగారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆయనకు నచ్చజెప్పి వెనక్కి పంపేందుకు బుద్దా వెంకన్న లాంటివారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైకాపా కార్యకర్తలు తమ జెండాకర్రలతో తెదేపా కార్యకర్తలపై దాడికి దిగారు. వాళ్ల చేతిలో కర్రలు లాక్కుని తెదేపా నాయకులూ ఎదురుదాడి చేశారు. తర్వాత పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. చంద్రబాబు ఇంటివద్ద ఘర్షణ జరుగుతున్న విషయం తెలిసి... రాజధాని గ్రామాలకు చెందిన పలువురు తెదేపా మద్దతుదారులు, మహిళలు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయానికి అక్కడ చంద్రబాబు రక్షణ కోసం రోజువారీ విధుల్లో ఉండే పోలీసులు తప్ప ఇంకెవరూ లేరు. ఘర్షణ మొదలైన తర్వాత అరగంటకు తాడేపల్లి, మంగళగిరి పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలనూ చెదరగొట్టారు. తెదేపా నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు ఇంటివైపు తరిమికొట్టారు. ఆ క్రమంలో బుద్దా వెంకన్న కింద పడిపోయారు. ఆయన సొమ్మసిల్లడంతో... సహచరులు చెట్ల నీడలో పడుకోబెట్టి సపర్యలు చేయగా తేరుకున్నారు. డూండీ రాకేష్‌, జంగా సాంబశివరావు తదితర తెదేపా నాయకులకు గట్టి దెబ్బలు తగిలాయి. రాళ్లు తగలడంతో ఒకరిద్దరికి రక్తం కారింది. ఈటీవీ కెమెరామన్‌ నాగరాజుకి రాయి తగిలి గాయమైంది. కొందరికి చొక్కాలు చిరిగిపోయాయి. గంటన్నరపాటు అక్కడ ఘర్షణ వాతావరణం కొనసాగింది. చివరకు పోలీసులు జోగి రమేష్‌ను అరెస్టు చేసి మంగళగిరి పోలీసుస్టేషన్‌కు తరలించడంతో వివాదం సద్దుమణిగింది. రమేష్‌ను పోలీసులు సుమారు గంటసేపు పోలీసు స్టేషన్‌లో ఉంచి పంపేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని