ముగిసిన తనీష్‌ విచారణ

ప్రధానాంశాలు

ముగిసిన తనీష్‌ విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: టాలీవుడ్‌ మత్తుమందుల కేసులో సినీ నటుడు తనీష్‌ విచారణ ముగిసింది. ఈడీ అధికారులు దాదాపు ఏడు గంటలపాటు వివిధ అంశాల గురించి ఆయనను ప్రశ్నించారు. మత్తుమందులు సరఫరా చేస్తూ పట్టుబడ్డ కెల్విన్‌ ఉదంతంలో తనీష్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆబ్కారీ అధికారులు 2017లోనే తనీష్‌ను విచారించి ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. అయితే.. మత్తుమందులు వాడినట్లు కానీ, కెల్విన్‌తో సంబంధాలు ఉన్నట్లు కానీ ఆధారాలు లభించకపోవడంతో ఆబ్కారీ అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రంలో ఆయన పేరు పెట్టలేదు. ఈడీ అధికారులు ప్రస్తుతం మత్తుమందుల కేసులో నిధుల మళ్లింపు వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు విచారణ చేపట్టిన సందర్భంగా మిగతా వారితోపాటు తనీష్‌ను కూడా పిలిచారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తిరిగివెళ్లారు. కెల్విన్‌ ముఠాతో ఆర్థిక సంబంధాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. కెల్విన్‌తో తనకెలాంటి సంబంధాలు లేవని తనీష్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూబి ఈడీ అధికారులు పెద్దగా ఆధారాలు సేకరించలేకపోయారని సమాచారం. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, విచారణకు రావాలని కోరితే మరోమారు హాజరవడానికైనా సిద్ధమే అని తనీష్‌ విలేకరులకు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని