రాజు మృతిపై న్యాయ విచారణకు ఆదేశం

ప్రధానాంశాలు

రాజు మృతిపై న్యాయ విచారణకు ఆదేశం

ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌; కాజీపేట, న్యూస్‌టుడే: సైదాబాద్‌లో చిన్నారి హత్యాచార సంఘటనలో నిందితుడైన పాలకొండ రాజు అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణకు శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో నివేదిక సమర్పించాలని వరంగల్‌ మూడో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ గోపికానాగశ్రావ్యకు చెప్పింది. రాజు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినపుడు చిత్రీకరించిన వీడియోను పెన్‌డ్రైవ్‌లో భద్రపరచి శనివారం రాత్రి 8 గంటల్లోగా వరంగల్‌ జిల్లా జడ్జికి అందజేయాలంది.ఈ పెన్‌డ్రైవ్‌ను వీలైనంత త్వరగా హైకోర్టు రిజిస్ట్రీకి పంపాలని జిల్లా జడ్జికి సూచించింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని నమోదుచేయాలంది. మృతుడి కుటుంబ సభ్యులతో పాటు ఎవరైనా ఏదైనా సమాచారం ఇవ్వాలనుకుంటే మేజిస్ట్రేట్‌ను కలవవచ్చంది. రాజు మృతిపై అనుమానాలున్నాయని, న్యాయ విచారణ జరిపించాలంటూ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్‌ వినతి మేరకు భోజన విరామ సమయంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వెంకన్న వాదనలు వినిపిస్తూ.. దిశ సంఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లే ఇక్కడా మరోలా చేశారన్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ ఊహాజనిత అంశాలతో పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం పిటిషనరు అనుమానాస్పద మృతిగా భావిస్తుండగా, ప్రభుత్వం ఆత్మహత్యగా చెబుతోందని, వీటిపై కోర్టు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని వ్యాఖ్యానించింది. అనుమానాలు వ్యక్తం చేసినందున న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామంది.


రాజుది ముమ్మాటికీ ఆత్మహత్యే: డీజీపీ

సైదాబాద్‌ సింగరేణి కాలనీ బాలిక హత్యాచార కేసు నిందితుడు రాజుది ముమ్మాటికీ ఆత్మహత్యేనని డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. ఈ ఘటనపై అనుమానాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ గురువారం ఉదయం 9.05 నిమిషాలకు హైదరాబాద్‌ వైపు వస్తుండగా రాజు దాని కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చూశారని ఆయన వెల్లడించారు. ఏడుగురు సాక్షుల వాంగ్మూలాలు నమోదయ్యాయన్నారు. ఈ ఘటనపై రైల్వే సిబ్బంది వెంటనే స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం అందించారన్నారు. సికింద్రాబాద్‌ రైల్వే సమాచార వ్యవస్థలోనూ నమోదు చేశారని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆత్మహత్యపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేయడం సరికాదని డీజీపీ పేర్కొన్నారు.  మరోపక్క హత్యాచార నిందితుడు రాజు రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించిన అన్ని రకాల సాక్ష్యాలను సిద్ధం చేసినట్లు కాజీపేట జీఆర్‌పీ డీఎస్పీ మల్లారెడ్డి శుక్రవారం తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని