ఎక్సైజ్‌ జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లు!

ప్రధానాంశాలు

ఎక్సైజ్‌ జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లు!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు విధానం ఎలా ఉండనుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సారి దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను అమలుచేస్తామని కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం దానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేయడంతో రిజర్వేషన్ల కేటాయింపు అంశానికి ప్రాధాన్యం సంతరించుకొంది. దుకాణాల్లో 15 శాతం గౌడలకు, 10 శాతం ఎస్సీలకు, 5 శాతం ఎస్టీలకు కేటాయించేందుకు అనుమతి లభించడంతో ఎక్సైజ్‌ శాఖ ఆ దిశలో కసరత్తు ప్రారంభించింది. ఎక్సైజ్‌ జిల్లా యూనిట్లను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాల కేటాయింపులో ఇప్పటివరకు రిజర్వేషన్ల విధానం లేదు. తొలిసారిగా దీన్ని ప్రవేశపెడుతుండటంతో ఈ ప్రక్రియ ఎలా ఉండబోతోందన్నది చర్చనీయాంశమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 2,216 మద్యం దుకాణాలు ఉన్నాయి. నవంబరు 1 నుంచి రాబోయే రెండేళ్లకు సంబంధించి కొత్త పాలసీ అమలులోకి రానుంది. కొత్త పాలసీలో దుకాణాల సంఖ్య మరింత పెంచే అవకాశముందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దుకాణాలకు సంబంధించి మూడు సామాజిక వర్గాల(గౌడ, ఎస్సీ, ఎస్టీ) వ్యాపారులకు 30 శాతం వరకు రిజర్వేషన్లు కేటాయించాల్సి ఉంది. దీని కోసం మొదట ఎక్సైజ్‌ చట్టంలో సవరణ చేయాలి. ఆ సవరణను శాసనసభ ఆమోదించాలి.రోస్టర్‌ విధానంలో ఎక్సైజ్‌ జిల్లాల వారీగా దుకాణాల కేటాయింపులు ఉండొచ్చని తెలుస్తోంది.

మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు పెంపు

రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రస్తుత లైసెన్స్‌ సంవత్సరం అక్టోబరు నెలాఖరుతో ముగియాల్సి ఉంది. తాజా నిర్ణయంతో నవంబరు 30 వరకు ఈ లైసెన్స్‌ కొనసాగుతుంది. ఈ క్రమంలో వ్యాపారులకు లభించే మార్జిన్‌ విషయంలో కొత్త మార్గదర్శకాల్ని అమలు చేయనుంది. కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేయనున్న నేపథ్యంలో అవసరమైన కసరత్తు చేసేందుకు ఈ గడువు పొడిగించినట్లు తెలుస్తోంది. మరోవైపు బార్ల యజమానులకు లైసెన్స్‌ రుసుంలో ఒక నెల మొత్తాన్ని రిబేట్‌ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మొత్తాన్ని వచ్చే సంవత్సరం లైసెన్స్‌ రుసుం నుంచి మినహాయించుకోనుంది. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో బార్లు పూర్తిగా మూసేసిన కారణంగా ప్రభుత్వం ఈ మినహాయింపు ఇచ్చింది.

నిర్ణయం చరిత్రాత్మకం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంత్రి శుక్రవారం రవీంద్రభారతిలో కులసంఘాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. సీఎం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని